సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న కేసీఆర్.. ఎందుకో తెలుసా?

by GSrikanth |
సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న కేసీఆర్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. దేశ వ్యాప్తంగా అదానీ వ్యవహరంపై చర్చ జరుగుతున్నా.. దాని గురించి ప్రధాని మాట్లాడలేదని అన్నారు. అదానీ రూపంలో ఉపద్రవం వచ్చిందని ఆరోపించారు. అదానీ ఆస్తి కరిగిపోతోంది, ఆయన సంస్థలు ఉంటాయో.. పోతాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చాడని, చివరకు ఏమైందో ఏమో గానీ అదృష్టం బాగుండి అదానీ కంపెనీ ఇంకా తెలంగాణలో నెలకొల్పలేదని అన్నారు. అదానీ గురించి ప్రధాని మోడీ సమాధానం చెప్పకుండా జబ్బ కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ కంటే కాంగ్రెస్‌ బెటర్ పరిపాలన అందించిందని అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో మంచి చేసినా బీజేపీ విమర్శలు చేసిందని గుర్తుచేశారు. మన్మోహన్ హయాంలో 14 శాతం అప్పులు తగ్గించారని అన్నారు.

దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే ప్రధాని మాట్లాడటానికి ఇష్టపడరని అన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం ఉండాలని అన్నారు. తలసరి ఆదాయంలో మనకంటే చిన్న దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువగా ఉందని తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అని సెటైర్ వేశారు. దేశంలోని ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకుండా మొండిచేయి చూపారని అసహనం వ్యక్తం చేశారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారని అన్నారు. మావి మాకు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నా పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు.

బీజేపీ విధానాల మూలంగా దేశంలో అనేక కంపెనీలు మూతపడుతున్నాయని అన్నారు. ఏడేళ్లుగా బీజేపీ తీసుకొచ్చిన ఏ ఒక్క పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేకపోయిందని అన్నారు. ముఖ్యంగా మేకిన్ ఇండియా అనేది పెద్ద జోక్ అని సెటైర్ వేశారు. మోడీ చేసే పనేంటో ప్రజలకు అర్ధం అయిందని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఎన్డీఏ అంటే.. నో డేటా అవేలబుల్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు.. ఒక బర్రె గుద్దితే పచ్చడైందని విమర్శించారు. అభివృద్ధిని పక్కనబెట్టి కేవలం పనికిమాలిన గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వచ్చి తెలంగాణలోని ఓ రేషన్ డీలర్‌తో గొడవ పడిందని గుర్తుచేశారు. ఏం సాధించారని రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో పెట్టాలని అడిగారు. బీజేపీ ప్రభుత్వం మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తోందని, ఇప్పటివరకు తాను చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం అవాస్తవం ఉన్నా.. రాజీనామాకు సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed