BRS MLC: ఆరోజు నేను సిటీలో లేను.. వరంగల్‌లో ఎల్లమ్మ పండుగకు వెళ్లా

by Gantepaka Srikanth |
BRS MLC: ఆరోజు నేను సిటీలో లేను.. వరంగల్‌లో ఎల్లమ్మ పండుగకు వెళ్లా
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామంలోని తన భూమిలో ఎవరో ఎవరో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని మీడియాలో వచ్చిన కథనాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(MLC Pochampally Srinivas Reddy) వివరణ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను 2018లో తోల్కట్ట గ్రామంలో సర్వే నంబర్ 165 పార్ట్‌లో 10 ఎకరాల 1 గుంట భూమిని రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశాను. ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పటి నుండి నా తరుపున ఆ భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలను నా మేనల్లుడు జ్ఞాన్‌దేవ్ రెడ్డి చూసుకుంటున్నాడు. నేను ఎమ్మెల్సీగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నందున.. సదరు భూమికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను జ్ఞాన్‌దేవ్ రెడ్డికి అప్పచెప్పాను. మీడియాలో వస్తున్నట్లు సదరు ప్రాపర్టీలో ఎటువంటి ఫామ్‌హౌజ్‌(Moinabad Farmhouse) కానీ గెస్ట్‌ హౌజ్ కానీ లేదు. అక్కడ కేవలం మామిడి, కొబ్బరి తోట, మరియు వ్యవసాయ పనిముట్లు పెట్టుకోవడానికి మరియు అక్కడ పనిచేసేవారు ఉండటానికి రెండు గదులు మాత్రమే ఉన్నాయి’’ అని శ్రీనివాస్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాదు.. ‘‘నా ప్రమేయం లేకుండా సదరు తోటను జ్ఞాన్‌దేవ్ రెడ్డి, వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లు నాకు నిన్న ఆ సంఘటన జరిగిన అనంతరం జ్ఞాన్‌దేవ్ రెడ్డిని విచారించగా తెలిసింది. ఆ తర్వాత తన ఆధీనంలో ఉన్నటువంటి ఆ తోటను వర్రా రమేష్ కుమార్ రెడ్డి, ఎం వెంకటపతి రాజుకి కౌలుకు ఇచ్చినట్లు జ్ఞాన్‌దేవ్ రెడ్డి ద్వారా నాకు తెలిసింది. నిన్నటివరకు ఈ విషయం నా దృష్టికి రాలేదు. నిన్న మీడియాలో వచ్చిన వార్తలు చూసిన తర్వాతే తోటకు సంబంధించిన ఈ విషయాలన్నీ నాకు జ్ఞాన్‌దేవ్ రెడ్డి ద్వారా తెలిశాయి. వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇట్టి విషయంలో సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేశాను.

మీడియాలో వార్తలు వస్తున్నట్లు ఆ తోటలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఉంటే వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంఘటన జరిగిన రోజు నేను హైదరాబాద్‌లో లేను.. వరంగల్‌లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నాను. కేవలం రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. నా 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క చిన్న కేసు కూడా లేకుండా ప్రజా సేవకే నేను అంకితమయ్యాను. మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన నేను చట్ట వ్యతిరేక చర్యలను, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోను. ఒకవేళ సదరు తోటలో అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరిగి ఉంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.

నేను ఆ భూమి యజమాని కాబట్టి వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు నాకు నోటీసు ఇచ్చారు. వారిచ్చిన నోటీసుకు నేను పూర్తి వివరణ ఇస్తాను. అలాగే ఈ కేస్ విచారణలో పోలీసులకు అన్ని విధాలుగా పూర్తి సహకారాన్ని అందిస్తాను. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు చిన్న విజ్ఞప్తి.. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దని మనవి. అలాగే.. సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపిస్తాను’’ అని వివరణలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story