కాంగ్రెస్‌ను ఇప్పుడే ఏమనొద్దు.. ఆర్నెళ్లు టైమిద్దాం: MLA సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-12-12 14:08:28.0  )
కాంగ్రెస్‌ను ఇప్పుడే ఏమనొద్దు.. ఆర్నెళ్లు టైమిద్దాం: MLA సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు తొందరపడి కాంగ్రెస్ పార్టీపై మాట్లాడొద్దని, ఓటమిని హుందాగా స్వీకరిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం నాలుగైదు నెలల సమయం ఇచ్చి వేచి చూశాక.. హామీలు అమలు చేయకపోతే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగైదు రోజులే అవుతుందని, విమర్శలు మంచిపద్దతి కాదన్నారు.

ఆరునెలల్లో పార్టీ పడిపోతుంది.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను పరామర్శించడానికి వెళ్తే ఒక సంవత్సరం మమ్మల్ని సీఎంగా ఉండనివ్వాలని బ్రతిమలాడుకున్నారని చెప్పి కొంతమంది పెద్దలు వాట్సాప్‌లలో స్టేటస్ పెట్టుకోవడం దురదృష్టకరం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ల వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని, అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. రేవంత్ మంచి సంప్రదాయం నెలకొల్పారని, మాజీ సీఎంను పరామర్శించడాన్ని అభినందించాలన్నారు.

బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని, కాంగ్రెస్ హామీలలో వైఫల్యం చెందితే ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదన్నారు. గెలిచినా ఓడినా ప్రజల యోగక్షేమాలే పరమాధిగా పనిచేస్తామన్నారు. పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తేలేదని, పార్టీలో తనకు సముచిత స్థానం ఉందన్నారు. తప్పుడు వార్తలను సృష్టిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శత్రువులం కాదు.. రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడానికి చాలా కారణాలు ఉన్నాయని, పొరపాట్లపై సమీక్షించి, విశ్లేషించుకుంటామన్నారు. జరిగిన పోరాట్లు మళ్లీ జరుగకుండా.. ప్రజల ముందుకు వెళ్తామన్నారు.

Advertisement

Next Story