MLA: ప్రజలను మోసం చేయడానికి ఇది మరొక ఎత్తుగడ

by Gantepaka Srikanth |
MLA: ప్రజలను మోసం చేయడానికి ఇది మరొక ఎత్తుగడ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బడ్జెట్‌లో మహానగరాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహానగరాన్ని నలుమూలల అనుసంధానం చేస్తూ ఎంతోమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రోకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. హైదరాబాద్‌కు ఏటా పదివేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, మాటలు చెప్పడానికే కానీ చేతల్లో ఉండవని మరోమారు నిరూపించారు. హైదరాబాద్ నగరానికి నిధులు కేటాయించకపోవడం నగరవాసులను తీవ్రంగా అవమానించడమే అని అన్నారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి పూర్తిచేసిన ఎస్ఎన్డీపీ, ఎస్‌ఆర్‌డీపీ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. తెలంగాణను పూర్తి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో శంకుస్థాపన చేపట్టిన మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని తెలిపారు. దీంతో నిరుపేదలకు అందాల్సిన వైద్యం మరింత ఆలస్యం కానుంది. ఉన్న నగరాన్ని విస్మరించి ఊహల నగరమైన ఫ్యూచర్ సిటీ కేంద్రంగా నిధుల కేటాయింపు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రజలను మోసం చేయడానికి ఒక ఎత్తుగడ మాత్రమే అని అన్నారు.

Advertisement
Next Story

Most Viewed