చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత నిరసన దీక్ష

by Javid Pasha |   ( Updated:2023-09-24 07:10:28.0  )
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత నిరసన దీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ నిరసన దీక్షకు దిగనున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో దీక్ష చేపట్టనున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నారు. నిన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన మోత్కుపల్లి.. ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన విషయం తెలిసిందే.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల అరెస్టును బీఆర్ఎస్ అధినేత ఇప్పటివరకూ ఖండించకపోవడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆ అరెస్టును ఖండించాల్సి ఉన్నదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అరెస్టులను ఖండించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఈ అరెస్టు వ్యవహారంలో కేసీఆర్ మౌనంగా ఉండడాన్ని అదే పార్టీకి చెందిన మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించడం గమనార్హం.

చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ సీఎం ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో తనతో పాటు కేసీఆర్‌ కూడా పని చేశారని నొక్కిచెప్పారు. రాజకీయాలను పక్కనపెట్టి కేసీఆర్‌ స్పందిస్తే ప్రజాస్వామ్యానికి మంచిదని సూచించారు. కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్న బీఆర్ఎస్‌లోనే తాను కూడా సభ్యుడినని, కానీ వ్యక్తిగతంగా తాను చంద్రబాబు అరెస్టు విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని, కేసీఆర్ కూడా అదే తీరులో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని భావించానని అన్నారు. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్, మల్లరెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులతో పాటు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ, ఈడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు కేసీఆర్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే విపక్షాలను బీజేపీ ఇలాంటి దర్యాప్తు సంస్థలతో వేధిస్తున్నదని వ్యాఖ్యానించారు. అదే తరహా విధానాన్ని చంద్రబాబు అరెస్టు విషయంలో అనుసరించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు ఖాయమని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టును అక్రమమైనదిగా అభివర్ణించారు.

Read More: సీఎం జగన్‌కు నాలుగు సీట్లు కూడా రావడం కష్టమే.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed