BRS: స్పీకర్ మాటలతో ఆ విషయం తేటతెల్లమైంది

by Gantepaka Srikanth |
BRS: స్పీకర్ మాటలతో ఆ విషయం తేటతెల్లమైంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని.. అబద్ధపు హామీలతో గెలిచిందని శాసన మండలి ప్రతిపక్షనేత ఎస్.మధుసూదనాచారి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలతో అది తేటతెల్లమైందన్నారు. స్పీకర్ ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపై చేతులు ఎత్తివేసిందని అర్థం అవుతున్నదన్నారు. సీఎం, మంత్రులు కూడా గ్యారెంటీలపై పొంతన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలప్పుడు ఇన్ని హామీలు ఎలా అమలు చేస్తారని అడిగితే.. ఆర్థిక పరిస్థితిపై తమకు అవగాహన ఉందని భట్టి సహా కాంగ్రెస్ నేతలు అన్నారని.. ఇప్పుడేమో ఒక్కో దానికి ఎగనామం పెడుతున్నారని అన్నారు.

అప్పుల గురించి కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసిందని.. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షా 43 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్పులతోపాటే రైతుల ఆత్మహత్యలూ పెరిగాయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా క్షేత్రంలో పోరాటం ఉధృతం చేస్తామని.. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. దొంగ గాంధీలు తెలంగాణకు వచ్చి తప్పుడు డిక్లరేషన్లు ఇచ్చి.. ప్రజలను మోసం చేశారన్నారు. గాంధీ విలువలు కేసీఆర్ పాటిస్తే.. కాంగ్రెస్ వాటిని తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed