యాదాద్రిలో భట్టికి అవమానం.. రాష్ట్ర ప్రజలకు BRS కీలక పిలుపు

by GSrikanth |
యాదాద్రిలో భట్టికి అవమానం.. రాష్ట్ర ప్రజలకు BRS కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్న ఈ నయా దేశ్‌ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను కింద కూర్చో బెట్టారని మండిపడ్డారు. గ‌తంలో ఎన్నడూ ఇలా లేదని, ఇది కొత్త సంప్రదాయమని, గ‌తంలో కుల సంఘం మీటింగ్‌లో పాల్గొని తామే ప‌రిపాల‌న చేయాల‌ని రేవంత్ రెడ్డి అన్నారని, ఎస్సీ, బీసీలు పాలించ‌బ‌డేటోళ్లు.. మేం దేశ్‌ముఖ్‌లం.. పాలించేటోళ్లం అని రేవంత్ చెప్పారని ఇవాళ అది ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను కింద కూర్చోబెట్టారన్నారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.. ఎక్కడ చెప్పుకోవాలి.. ఎవరికి చెప్పుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైనా భట్టి విక్రమార్కనే అవమానించారన్నారు.74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుందన్నారు. యావత్ దళిత జాతిని అవమానించారన్నారు.

ఎస్సీల‌కు డిప్యూటీ సీఎం, మంత్రి ప‌ద‌వి ఇచ్చి పెద్దపీట వేసిన‌ట్లు ప్రచారం.. కానీ ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చేవ‌ర‌కు కాళ్ల ద‌గ్గర కూర్చోబెట్టుకోవ‌డం జరుగుతుందన్నారు. వాటికి నిద‌ర్శన‌మే యాదాద్రి సంఘ‌ట‌న‌ అన్నారు. ఇది అనుకోకుండా జ‌రిగిన ఘ‌ట‌న కాదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ, బీసీ నాయ‌కులు స్పందించాలని కోరారు. కాంగ్రెస్ హైక‌మాండ్ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ద‌ళితుడిని నియ‌మించామ‌ని చెప్పడం కాదని, భట్టికి జరిగిన అవమానంపై స్పదించాలని కోరారు. అవ‌మానం జ‌రుగుతంటే ఊరుకోవ‌డం స‌రికాద‌న్నారు. భట్టి కి జరిగిన అవమానకరపు ఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూడాలన్నారు. జరిగిన ఈ ఘటన పై నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి భట్టి విక్రమార్క ఫొటో పక్కన పెడుతున్నారని, ప్రభుత్వ యాడ్స్‌లోనూ కనిపించడం లేదని మండిపడ్డారు.

Advertisement

Next Story