CM Revanth Reddy: రాష్ట్రాన్ని చీకట్లో నుంచి కాపాడింది ఆయనే : సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-07-29 06:40:55.0  )
CM Revanth Reddy: రాష్ట్రాన్ని చీకట్లో నుంచి కాపాడింది ఆయనే : సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది ముమ్మాటికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి అని సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీలో వివిధ శాఖల పద్దులపై చేపట్టిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ కోతలు ఎక్కడా ఉండకూడదని ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఆ నిర్ణయాన్ని సాహసోపేతంగా తీసుకున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌కు ఆదాయం మరింత పెరిగిందని గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైపాల్‌రెడ్డి చూశారని పేర్కొన్నారు. ఆయన వల్లే తెలంగాణకు 54 శాతం విద్యుత్ వచ్చేలా విభజన జరిగిందని తెలిపారు. ఉత్పత్తి, సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఏపీలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణను ముమ్మాటికి చీకట్ల నుంచి కాపాడిన మహానుభావుడు జైపాల్‌రెడ్డి అని అన్నారు. సోనియా గాంధీ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్లే రాష్ట్రం విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కిందని స్పష్టం చేశారు. విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ సభ్యులని.. సుప్రీం కోర్టు కూడా.. విచారణ కొనసాగించాలని చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story