మంత్రులకు బిగ్ టాస్క్.. ప్రియారిటీ దక్కనుండటంతో మినిస్టర్స్ అలర్ట్!

by Disha Web Desk 4 |
మంత్రులకు బిగ్ టాస్క్.. ప్రియారిటీ దక్కనుండటంతో మినిస్టర్స్ అలర్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు మంత్రులకు చాలెంజ్‌గా మారాయి. అభ్యర్థుల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా వారు గెలవడానికి చేసిన ప్రచారం కంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించుకోడానికే ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. సొంత పనులన్నింటినీ పక్కన పెట్టి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాల్లోని వివిధ స్థాయిల్లోని సొంత పార్టీ లీడర్లను సమన్వయం చేసుకుంటూనే, విపక్ష లీడర్లను, కేడర్‌ను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. ఒక్కో మంత్రికి ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని కేటాయించి వాటికి ఇన్‌చార్జిలుగా నియమించడంతో పోలింగ్ ముగిసే వరకు ఆ సెగ్మెంట్లలోనే మకాం వేస్తున్నారు. అభ్యర్థులతో కలిసి ర్యాలీలు, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాల్లో ముందుండి గైడ్ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపును సవాలుగా తీసుకున్నారు.

పట్టు కోసం మంత్రులు

అటు ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాలతో పాటు సొంత నియోజకవర్గం, జిల్లాలో గెలిపించుకోవడం ద్వారా పట్టు నిలుపుకోవడం కూడా మంత్రులకు అవసరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను తొలుత కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమించినా ఆ తర్వాత వారిద్దరికీ ఓవరాల్ సమన్వయ బాధ్యతలు అప్పజెప్పిన ఏఐసీసీ మిగిలిన పది మంది మంత్రులకూ ఒక్కో నియోజకవర్గాన్ని గెలిపించే టాస్క్ ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి అనుసరించిన వ్యూహాన్నే లోక్‌సభ ఎన్నికల సందర్భంగానూ రూపొందించి 15 స్థానాల్లో గెలుపొందేలా మిషన్-15 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన సమావేశంలోనూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్... అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యతను మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.

ఎన్నికల బిజీలో మంత్రులు..

లోకసభ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం... 15 ఎంపీ స్థానాలను గెలవాలని టార్గెట్ పెట్టింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పూర్తి స్థాయి ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. మంత్రులకు నియోజకవర్గాలను కేటాయించి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు అప్పజెప్పడంతో ఒకవైపు పాలనాపరంగా వారి శాఖలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూనే, విధాన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే అటు పార్లమెంటు ఎన్నికలపైనా ఫోకస్ పెట్టారు. మంత్రులు వారి పార్లమెంట్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతో రెగ్యులర్‌గా మీటింగులు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా ముఖ్య లీడర్లతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. విపక్ష పార్టీలకు బలంగా ఉన్న లీడర్లను, కేడర్‌ను గుర్తించి వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రిజల్ట్ మేరకు ప్రభుత్వంలో ప్రియారిటీ

మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన ఎంపీ సెగ్మెంట్‌లలో సొంత పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే, భవిష్యత్తులో రాజకీయంగా మరింత ప్రియారిటీ ఉంటుందనే సంకేతాలను అధిష్టానం కల్పించింది. మంత్రివర్గంలో మరో ఆరు ఖాళీగా ఉన్నందున లోక్‌సభ ఎన్నికల తర్వాత విస్తరించాలన్నది ముఖ్యమంత్రి, పార్టీ హైకమాండ్ ఉద్దేశం. ఈ ఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఆ అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో బెర్త్ దొరికే అవకాశమున్నది. కీలకంగా మారిన భువనగిరి ఎంపీ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారాన్ని కోరడానికి నేరుగా ఆయన ఇంటికే వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారనే వార్త పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో ప్రయారిటీ

దీనికి తోడు అభ్యర్థి గెలుపు కోసం కష్టపడిన, ఎక్కువ మెజారిటీని సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలను విశ్లేషించి అందుకు కృషి చేసిన ఎమ్మెల్యేలకు ప్రయారిటీ పెంచి వారు సూచించిన అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇస్తామనే సిగ్నల్ పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ కారణంగా మంత్రులు వారి ప్రధాన అనుచరులను రంగంలోకి దింపారు. పార్టీ విజయం కోసం పనిచేస్తేనే కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కుతాయంటూ వారికి టాస్క్ అప్పగించారు. పార్టీ బలహీనంగా ఉన్న ఏరియాలను గుర్తించి, అక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఇతర పార్టీలకు చెందిన లోకల్ లీడర్లకు అక్కడ పాపులారిటీ ఉండి వారి ద్వారా ఓటు బ్యాంకు వస్తుందనుకుంటే చేర్చుకునే ప్రయత్నాలనూ ముమ్మరం చేశారు. ఏఐసీసీ మిషన్-15 టార్గెట్ పెట్టినా కనీసంగా డజనుకు తగ్గకుండా సీట్లను గెలవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు.

Next Story

Most Viewed