- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Telangana: పరిమితికి మించి కృష్ణా జలాలు తరలిస్తున్న ఏపీ

దిశ, తెలంగాణ బ్యూరో: బయటి పరీవాహక ప్రాంతాలకు నీటిని తరలించడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ న్యాయవాదులు తెలిపారు. శుక్రవారం కేడబ్ల్యూడీటీ-2 (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్) బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించారు. మూడో రోజు తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించారు. బేసిన్ అవతలికి నీటిని తరలించొద్దని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రాన్‌బేసిన్ మళ్లింపు విషయంలో కేవలం తాగునీటి అవసరాలను మాత్రమే పరిగణించాలని.. కానీ ఇతర అవసరాల నిమిత్తం ఏపీ జలాలను తరలిస్తున్నదని పేర్కొన్నారు. కావేరీ ట్రిబ్యునాలిస్‌లో తమిళనాడు, కర్ణాటక కేసుల మాదిరిగానే ఏపీ, తెలంగాణ కేసును పరిష్కరించాలన్నారు.
సాధారణంగా ఒక నదీ పరీవాహక ప్రాంతంలో లభ్యమయ్యే నీరంతా ఇన్-బేసిన్ అవసరాలను తీర్చడానికి ఉపయోగించాలని.. కావేరీ ట్రిబ్యునల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందన్నారు. ఆ అవసరాలు తీరాక ఇంకా ఏదైనా మిగులు నీరు ఉంటే దానిని ఇతర అవసరమైన బేసిన్‌లకు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కానీ.. కృష్ణా బేసిన్‌లో అందుబాటులో ఉన్న నీటిని కేటాయింపులకు మించి తరలించిందని పేర్కొన్నారు. కావేరి ట్రిబ్యునల్ సూచించినట్లు, సుప్రీంకోర్టు సమర్థించినట్లు దీర్ఘకాలిక పంటలను స్వల్పకాలానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ నీటిని తరలిస్తున్నదని, తెలంగాణలోని పలు ప్రాంతాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. 811 టీఎంసీలలో 71% బేసిన్ పరిమితుల ఆధారంగా తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఔటర్ బేసిన్ ప్రాంతాలు పెన్నా బేసిన్, గుండ్లకమ్మకు అదనపు నీటి వనరులను తరలించాలరని కేడబ్ల్యూడీటీ -2 దృష్టికి తీసుకువచ్చారు.
గోదావరి నీటి తరలింపునకూ ప్రయత్నం
పోలవరం నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువకు.. ఆ తర్వాత 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లేపల్లి రిజర్వాయర్‌కు 20 టీఎంసీల మళ్లింపుతో బనకచర్ల క్రాస్ రెగ్యులేషన్‌కు 200 టీఎంసీల మేర గోదావరి జలాలను సైతం పెద్దఎత్తున మళ్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ట్రిబ్యునల్ దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు వనరులు ఉన్నాయని.. అయినా కొత్తగా గోదావరి జలాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఏపీ పెన్నార్, చుట్టుపక్కల ఉన్న ఇతర బేసిన్‌లను కలిపి 360 టీఎంసీల నీటిని తరలించిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కువ నీరు వినియోగించే వరి, చెరకు వంటి పంటల సాగుకు నీటిని కోరడం లేదని, ఎండిపోయిన పంటలకు నీరు కావాలని అడుగుతున్నామని పేర్కొన్నారు. కాగా.. మూడు రోజుల పాటు వాదనలు విన్న కమిసన్ తదుపరి వాదనలను మార్చి 24కు వాయిదా వేసింది. మరోసారి మార్చి 24 నుంచి 26 వరకు వాదనలు వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది.