ఆపదలో ఆపద్బంధు స్టాఫ్..!

by Sumithra |
ఆపదలో ఆపద్బంధు స్టాఫ్..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : కుయ్...కుయ్ మంటూ శబ్దం వినిపిస్తే చాలు..! 108 వాహనం ఎటు వైపో వెళుతోంది. ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది...అని అనుకుంటాం. యాక్సిడెంట్స్ లో గాయపడి చావుబతుకుల్లో ఉన్న వారిని తరలించి చికిత్సలు అందించి ప్రాణాపాయం నుండి కాపాడే ఆపద్బాంధవుడు సిబ్బంది ఇప్పుడు ఆపదలో పడ్డారు.గడిచిన 8 ఏళ్లుగా రూపాయి జీతం పెంచకుండా 108 సిబ్బందితో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోంది. పది నుంచి 18 సంవత్సరాలుగా 108 వాహనాలు పనిచేస్తున్న పైలెట్లు ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) లు జీతం పెరుగుతుందన్న ఆశతో అదే ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యోగం వదిలేసి బయటకు వెళ్దామంటే వయస్సు మీద పడిందని బయటకు వెళితే ఉన్నఉద్యోగం ఊడిపోవడం మినహా మరేమి దక్కదని ఆవేదనతో అదే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ప్రతిఏటా 10% జీతాలు పెంచుతామని ఉద్యోగాల్లో చేరేటప్పుడు వారికి హామీ ఇచ్చినప్పటికీ గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా ఆహామీ ఆచరణ రూపం దాల్చడం లేదని ఆవేదన చెందుతున్నారు.

416 వాహనాలు.. 1700 మందికి పైగా సిబ్బంది..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 416 వాహనాలు నడుస్తున్నాయి. అన్ని జిల్లా కేంద్రాలు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఒక్కోచోట రెండు మండలాలకు కలిపి 108 వాహనాలను నడుపుతున్నారు. వీటి నిర్వహణను ప్రభుత్వం జీవీకే సంస్థకు అప్పగించింది. ప్రతి వాహనంపై ప్రతినెల 1,81,000 చొప్పున ఖర్చు చేస్తోంది. ఇందులోనే సిబ్బంది జీతాలు, వాహనం మెయింటెనెన్స్, వాహనానికి డీజిల్ వంటి ఖర్చులన్నీ అందులోనే భరించాలి. ప్రతి వాహనాన్ని ఇద్దరు పైలట్లు ఇద్దరు ఈఎంటీలను కేటాయించి జీవీకే సంస్థ నడుపుతోంది.

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి పైలట్ కు 10వేలు ఈఎంటికీ 11,000 చెల్లిస్తున్నారు. సీనియర్లకు ఈ రెండు కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 15 నుంచి 20వేల మధ్య జీతాలు ఇస్తున్నారు. అయితే గడిచిన 8 సంవత్సరాలుగా అంటే 2016లో పెంచిన వేతనాలు అమలు చేస్తున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు 108 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఒక్క రూపాయి జీతం కూడా పెరగలేదు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీలు అమలు చేస్తుండగా కాంట్రాక్టు ఉద్యోగులకు 30% దాకా వేతనాలు పెంచింది కానీ 108 వాహనాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం ఒక్క రూపాయి జీతం పెంచలేదు.

కాంట్రాక్ట్ రెగ్యులర్ ఇవ్వకపోవడం కారణంగానే...

108 వాహనాలను ప్రభుత్వం జీవీకే సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ వాహనాల నిర్వహణ నడుస్తోంది. అయితే గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఓసారి మాత్రమే జీవీకే సంస్థకు వాహనాల నిర్వహణను పొడిగిస్తూ వచ్చింది. దీంతో ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో ఆ సంస్థ ఒక నిర్ణయం తీసుకోలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ను జీవీకే సంస్థకు దీర్ఘకాలం పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తమవేతనాలు పెరుగుతాయన్న ఆశాభావం 108 ఉద్యోగుల్లో కనిపిస్తోంది.

మూడు స్లాబుల విధానం అమలవుతుందా..?

గతంలో ఉద్యోగులకు ప్రతి ఏటా 10% జీతం పెంచుతామని యాజమాన్యం చెబుతూ వచ్చింది. అయితే ఇంతవరకు అది అమలు కాలేదు తాజాగా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు ఉద్యోగులకు మూడు స్లాబుల్లో జీతం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. నాలుగు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు 8 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు 8 ఏళ్లకు పైబడి పని చేసిన ఉద్యోగులుగా విభజించి వారికి వేతనాలు ఖరారు చేస్తామని జీవీకే సంస్థ చెబుతున్నట్లు సమాచారం. దీని ప్రకారం వేతనాలు పెంచితే నాలుగేళ్ల పాటు పనిచేసిన 108 పైలట్ కు 16,000 ఈఎంటీకి 18,000, 8 ఏళ్లు పనిచేసిన పైలట్ కు 20,000 ఈఎంటీ కి 22,000, 8 ఏళ్లు ఆపై సర్వీసు ఉన్న పైలట్ కు 24,000, ఈఎంటీ కి 26,000 ఇస్తామని సంస్థ హామీ ఇచ్చినట్లు సమాచారం.

దీనిపై ఉద్యోగులు నిరసనతోనే ఉన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు ప్రభుత్వ అనుబంధ కార్పొరేషన్ల ఉద్యోగులకు పీఆర్సీలో అమలు చేసినట్టు కాంట్రాక్టు సిబ్బందికి సైతం 30% పెంచారని... అదే విదానం తమకు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తెచ్చి నేషనల్ హెల్త్ మిషన్ కింద చేర్చాలని 108 ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story