ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

by Sridhar Babu |
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పంచాయతీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం నుండి మొబైల్ యాప్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

సర్వే నెంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. దరఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురిచేయకూడదని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే, వారు ప్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని, క్షేత్రస్థాయి పరిశీలనలో అది ప్రైవేట్ స్థలమేనా, లేక ప్రభుత్వ స్థలమా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, డీపీఓ శ్రీలత, ఏఓ పంచాయతీ సెక్రటరీ లు, ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed