- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలో మరో ఉద్యమం... డిసెంబర్ 9న భారీ బహిరంగ సభ

దిశ ప్రతినిధి, నిర్మల్: చారిత్రాత్మక ఇంద్రవెల్లి మరో పోరుకు వేదిక కాబోతోంది. నాలుగు దశాబ్దాల క్రితం ఆదిలాబాద్ అడవుల్లో రక్తపాతం చవిచూసిన ఆదివాసీ అమరుల స్ఫూర్తితో మరోపోరుకు ఉట్నూరు ఏజెన్సీ ఆదివాసి సంఘాలు పోరాటానికి సన్నద్ధం అవుతున్నాయి. ఆదివాసీ అస్తిత్వ పోరుగర్జన పేరిట డిసెంబర్ 9వ తేదీన ఇంద్రవెల్లి మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సభకు అనుమతి లభించిందా లేదా అన్నది ఇంకా తేలలేదు.
వలస లంబాడాల ఆధిపత్యం పైనే...
2018లో ప్రారంభమైన ఆదివాసీ సంఘాల ఆందోళన పథం దశలవారీగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచిన నేపథ్యంలో తమ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లాలన్న ఆలోచనతో ఆదివాసీ సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5, 6 అధికరణల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకే చెందాలన్న ప్రధాన డిమాండ్ తో ఆదిమ గిరిజన తెగలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. గత మూడున్నర సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆందోళన ఒక ఏడాది అయితే లంబాడా ఉపాధ్యాయులు పనిచేసే బడులు సైతం నడవని పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత ఇరు వర్గాల నడుమ తీవ్ర విభేదాలు తలెత్తాయి ఆదివాసులు, లంబాడాలు గ్రామాల్లో ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితి కూడా దాటిపోయింది. అయితే తర్వాత ఉద్యమం కాస్త చల్లబడింది. ఆదివాసీల ఉద్యమం వెనుక తుడుం దెబ్బతోపాటు ఇతర ఆదివాసీ సంఘాలు బలంగా ఉండడంతో ఈ వివాదం జాతీయస్థాయికి వెళ్ళింది. రాజకీయ పార్టీలు ఈ పోరాటాన్ని ఎవరికి వారుగా ఆయుధంగా మలుచుకున్నారే తప్ప వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
మరో పోరుకు సన్నద్ధం..
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల హక్కులు పరిరక్షించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్న నేపథ్యంలో మరోసారి ఆదివాసీ సంఘాలు ఆందోళనకు సన్నద్ధం అవుతున్నాయి. ఉట్నూరు ఏజెన్సీలో ఉన్న ఇంద్రవెల్లి కేంద్రంగా ఆదివాసీ పోరు గర్జన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు. ఆందోళన విస్తృతం చేసేందుకు చారిత్రాత్మక ఇంద్రవెల్లి కేంద్రాన్ని వేదికగా ఆదివాసీ సంఘాలు ఎంచుకున్నాయి. వలసలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకుండా రాజ్యాంగంలోని 342 ప్రకారం లంబాడాల ఎస్టీ హోదా తొలగించాలన్న ప్రధాన డిమాండ్ ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రణాళిక చేస్తున్నారు.
ఏబీసీడీ వర్గీకరణకు ఒత్తిడి..?
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచిన నేపథ్యంలో ఈ రిజర్వేషన్లలో ఆదిమ గిరిజనులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు డిసెంబర్ 9న జరుగుతున్న ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలని సంఘాలు యోచిస్తున్నాయి. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఆదిమ గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న 10 శాతం రిజర్వేషన్లలో ఏబీసీడీలుగా వర్గీకరించి ఆదిమ గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ ఈ సందర్భంగా వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.
సభకు అనుమతి లభించేనా..?
సుదీర్ఘకాలంగా ఆదివాసీ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటంపై పాలకపక్షాల అణచివేత కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కుల కోసం తాము పోరాటం చేస్తుంటే ఓటు రాజకీయాల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ ఆందోళనను పట్టించుకోవడం లేదన్నది ఆదివాసీల ప్రధాన ఆరోపణ. ఇంద్రవెల్లి కేంద్రంలో డిసెంబర్ 9న నిర్వహించ తలపెట్టిన పోరుగర్జనకు ప్రభుత్వం, పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సభకు అనుమతి ఇస్తారా లేదా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆదివాసీ సంఘాలు నిర్ణయించిన నేపథ్యంలో సభకు అనుమతి ఇస్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికార వర్గాల్లో ఉంది.
342 అమలు కోసమే ఆందోళన: పెందూర్ మాధవ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు
తెలంగాణలో ఆదిమ గిరిజనుల హక్కుల కోసం మేము నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నాము, అయినప్పటికీ ప్రభుత్వాలు మా న్యాయపరమైన పోరాటాలను గుర్తించడం లేదు. హక్కులను కాపాడడంలో పాలక పక్షాలు ఆదిమ గిరిజనులను మోసం చేస్తున్నాయి. రాజ్యాంగంలోని 342 అధికరణ ప్రకారం లంబాడాలకు ఎస్టీ హోదా ఇవ్వవద్దన్న అంశాన్ని పక్కనపెట్టి ఓటు రాజకీయాల కోసం మాకు అన్యాయం చేస్తున్నారు. దీనిపైన మా సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో ఆదివాసీల అస్తిత్వ పోరుగర్జన నిర్వహిస్తున్నాం.