Kaushik Reddy VS GANDHI: కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. తెరపైకి సెంటిమెంట్ అస్త్రం!

by Prasad Jukanti |
Kaushik Reddy VS GANDHI: కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. తెరపైకి సెంటిమెంట్ అస్త్రం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. పీఏసీ చైర్మన్ పదవిని అరికెపూడి గాంధీకి ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ మధ్య చెలరేగిన వివాదం అనూహ్య మలుపు తీసుకుంటోంది. ఈ ఇద్దరి మధ్య వివాదంలో లోకల్, నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. తన ఇంటిపై అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. ఆంధ్రావాళ్లు దాడి చేస్తే తెలంగాణ బిడ్డలం ఊరుకుంటామా? రేపు తెలంగాణ పవరేంటో చూపిస్తానని, చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో చూపిస్తానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ వ్యాఖ్యలతో కౌశిక్ రెడ్డి నాన్ లోకల్ అంశాన్ని లేవనెత్తుతున్నారని రాజకీయ వర్గాలు, సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

తెరపైకి సెటిలర్ల ఇష్యూ :

గత కొంత కాలంగా రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ విషయంలో సెంటిమెంట్ పాలిటిక్స్ ప్లే చేయబోతున్నదా అనేది నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాంధీని టార్గెట్ చేసిన కౌశిక్ రెడ్డి మీకులా నేను ఎక్కడి నుంచో ఇక్కడ బతకడానికి వచ్చిన వాడిని కాదని నేను ఈ గడ్డమీద పుట్టిన వాడిని ఇక్కడి వాడిని అంటూ కౌశిక్ రెడ్డి ఎటాక్ స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేనని అలాంటి నన్ను బతకడానికి వచ్చానని ఎలా అంటావని కౌశిక్ ను అరికెపూడి గాంధీ ప్రశ్నించారు. అలా అయితే నువ్వు కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చావు? బతకడానికి కాదా? అని నిలదీశారు. 29 రాష్ట్రాల ప్రజలు ఉంటున్న ఈ నగరంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నావా అంటూ ఫైర్ అయ్యారు. ఈ ఇరువురు నేతల మధ్య డైలాగ్ వార్ హైదరాబాద్ లోని సెటిలర్ల అంశం తెరమీదకు తెచ్చినట్లైంది.

బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం!:

కౌశిక్ రెడ్డి చేసిన లోకల్, నాన్ లోకల్ వ్యాఖ్యలకు పార్టీ మద్దతు ఉంటుందా లేక అవి కేవలం ఆయన వ్యక్తిగత వ్యాఖ్యల వరకే పరిమితం అవుతాయా అనేది సస్పెన్స్ గా మారింది. గత కొంత కాలంగా సెటిలర్లు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా నిలదొక్కుకోవడానికి తెలంగాణ పేరుతో రాజకీయం చెయ్యడానికి బీఆర్ఎస్ సెటిలర్ల అంశాన్ని, సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నదా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలాంటి టర్న్ లు తీసుకుంటాయో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed