రేవంత్‌తో నేరుగా యుద్ధానికి దిగిన కాంగ్రెస్ కీలక నేత?

by GSrikanth |   ( Updated:2023-04-01 17:55:18.0  )
రేవంత్‌తో నేరుగా యుద్ధానికి దిగిన కాంగ్రెస్ కీలక నేత?
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల రాష్ట్ర అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వరం మారుతున్నదా..? అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ ఉనికి కోసం.. విస్తరణ కోసం ఆర్థికంగా ప్రతీసారి అండగా నిలుస్తూ.. ఏఐసీసీ స్థాయిలో సంబంధాలను పెంచుకున్న మహేశ్వర్ రెడ్డి ఇటీవల కాలంలో కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డితోనే ఆయన తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తొలుత సాన్నిహిత్యం.. క్రమంగా పెరుగుతున్న వైరం

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లో సాన్నిహిత్యంగా మెలిగిన ఏలేటి.. క్రమంగా రేవంత్‌తో వైరం పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించిన ఇంద్రవెల్లి పోరుగర్జన బహిరంగ సభ వీరి మధ్య గొడవకు దారితీసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో తన ప్రత్యర్థిగా భావించే, తూర్పు జిల్లా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావును రేవంత్ రెడ్డి చేరదీసినట్లు ప్రచారం జరిగింది. అసీఫాబాద్, ఉట్నూరు ప్రాంతంలో బలం ఉన్న ప్రేమ్ సాగర్ రావుకు ఇంద్రవెల్లి బాధ్యతలు అప్పగించిన నాటినుంచి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యేంతవరకు తనతో సన్నిహితంగా ఉండి.. ఉమ్మడి జిల్లాలో తన బద్ధ శత్రువు అయిన ప్రేమ్ సాగర్ రావును రేవంత్ రెడ్డి ప్రోత్సహించడాన్ని ఆయన జీర్ణించుకోలేదని, అప్పట్నుంచి మహేశ్వర్ రెడ్డి క్రమంగా రేవంత్‌కు దూరం అవుతూ వస్తున్నారని చెబుతున్నారు. ఆ గుర్రుతోనే కొంతకాలంగా అధిష్టానం ఇచ్చే పిలుపులను మహేశ్వర్ రెడ్డి పట్టించుకోవడం లేదని చర్చ జరుగుతోంది. అంతేగాకుండా.. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాకుండా తన పేరును ఎగ్జిక్యూటివ్ కమిటీలో చేర్చడంపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహంతో ఉన్న విషయం కూడా పార్టీ వర్గాల్లో అందరికీ తెలుసు.

అధ్యక్షుడితోనే అసలు పోరు..

పీసీసీ చీఫ్ తీరుపై మహేశ్వర్ రెడ్డి మొదట్లో వ్యతిరేక వ్యాఖ్యలు సుతిమెత్తగా చేసేవారు. క్రమంగా స్వరం పెంచారు. బయటినుంచి వచ్చిన వాళ్లే పార్టీలో పెద్ద పదవులు అనుభవిస్తున్నారంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించే మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అప్పటినుండే మహేశ్వర్ రెడ్డి దూకుడు పెంచినట్లు సమాచారం. నేరుగా రేవంత్ రెడ్డితోనే తలపడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు పార్టీలో తొలినుండి అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి వంటి వారితో కలిసి రేవంత్ రెడ్డిపై ప్రత్యక్ష పోరుకు సన్నద్ధం అవుతున్నారు. పార్టీలోనే ఉన్న కొందరు సీనియర్లు రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేస్తుంటే.. మహేశ్వర్ రెడ్డి మాత్రం పార్టీ నష్టపోవడానికి రేవంత్ రెడ్డి కారణం అంటూ బహిరంగంగా ఎదురుదాడికి దిగడం కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం విస్మయానికి గురిచేస్తున్నది.

తాజాగా మహేశ్వర్ రెడ్డి గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నాడని.. ఆయన వల్లనే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి ఇంతమంది ప్రధాన కార్యదర్శులు లేరని రేవంత్ రెడ్డి బల ప్రదర్శన.. పార్టీ రాష్ట్ర కమిటీలో చూపుతున్నారని ఆయన చూపాల్సింది ప్రజల సమస్యలపై అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలు ప్రకారం అందరినీ కలుపుకొని పార్టీకి పెద్ద కొడుకులా ఉండాలని సూచించారు. పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న మహేశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలు చేయడానికి ముందు ఇలాంటి సీనియర్లతో చర్చించిన తర్వాతే మాట్లాడుతున్నట్టు కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీనియర్లు సైతం పరోక్షంగా మాట్లాడుతుంటే మహేశ్వర్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిపై నేరుగా చేస్తున్న వ్యాఖ్యలు ఎటు దారితీస్తాయన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారుతోంది.

రాహుల్‌తో.. అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు

రేవంత్ రెడ్డితో ఢీకొంటున్న ఏలేటికి కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోనూ దగ్గరి సంబంధాలు ఏర్పరచుకున్నారు. పార్టీ ఢిల్లీ పెద్దలు కేసీ వేణుగోపాల్, బోసురాజు, శ్రీనివాసన్ వంటి ముఖ్యులతో ఆయన సంబంధాలు కలిగి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఆర్థికంగా ప్రతీసారి ముందుండే మహేశ్వర్ రెడ్డిని ఢిల్లీ అధిష్టానం కూడా గుర్తించింది. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి ఏడాదే భారీ ఖర్చుతో కూడిన రాహుల్ గాంధీ పాదయాత్ర బహిరంగ సభలను నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసి ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. అప్పటినుంచి వెనుదిరిగి చూడకుండా పార్టీలో పట్టు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన ఏఐసీసీ రాష్ట్ర కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకొని పార్టీలో ఎదిగారు. మరి ఏలేటి వ్యాఖ్యలకు రేవంత్ స్పందించి, సమస్యలు సర్దుమణిగేలా చూస్తారా? లేక మహేశ్వర్ రెడ్డిని మరింత దూరం చేసుకుంటారా? అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story