- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బోర్డుకు ఆ అధికారం లేదు.. ప్రాజెక్టుల డీపీఆర్‌లపై తెలంగాణ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సిన అధికారం గోదావరి నది యాజమాన్య బోర్డుకు లేదని, దీనిపై అంతిమ అధికారం కేంద్ర జల సంఘానికే ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఇటీవల జారీచేసిన గెజిట్‌లో కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ ప్రస్తావించిందని, నిజానికి ఇవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే సమైక్య రాష్ట్రంలో ప్రారంభమైనవని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో మాత్రమే ఏపీ విభజన చట్టం ప్రకారం జీఆర్ఎంబీ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లను విభజన చట్టం ప్రకారం పరిశీలించి కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరుతూ అక్టోబరు 26న లేఖ రాసిందని, వెంటనే పంపాలని పేర్కొన్నారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం, మోడికుంట వాగు ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభమైన ప్రాజెక్టులని, అందువల్ల ఇవి విభజన చట్టంలోని సెక్షన్ 85 (8) (డి) పరిధిలోకి రావని నొక్కిచెప్పారు. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే ఉన్నాయని, వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జూలై 15న జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఆరు ప్రాజెక్టులను ఆమోదం పొందని జాబితాలో చేర్చిందని, విధిగా ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాలని నిర్దేశించిందని, కానీ ఆ కోవలోకి పై ఆరు ప్రాజెక్టులు రావని వివరించారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లలో ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే పరిధి చట్టం ప్రకారం గోదావరి బోర్డుకు లేదని, వీటిని పరిశీలించడానికి కేంద్ర జల సంఘంలో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయని గుర్తుచేశారు. రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని పరిశీలించటానికి గతంలో కృష్ణా బోర్డు సాంకేతిక అంశాల డాక్యుమెంట్లను నేరుగా కేంద్ర జల సంఘానికి పంపించిందని, కానీ గోదావరి బోర్డు మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని అవలంబిస్తున్నదని, డీపీఆర్‌ల పరిశీలనలో రెండు నదీ బోర్డులు భిన్నమైన పద్దతులను అనుసరించడాన్ని తప్పుపట్టారు. పూర్తి అయిన ప్రాజెక్టులుగానీ, ప్రస్తుతం నిర్మాణపు పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులకుగానీ డీపీఆర్‌లను పరివీలించిన తర్వాత సాంకేతిక అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర జల సంఘానిదే తప్ప బోర్డులది కాదన్నారు.
గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండవ మీటింగులో కూడా కేంద్ర జల శక్తి మంత్రి డీపీఆర్‌లను త్వరితగతిన పరిశీలించి ఆమోదం తెలుపుతామంటూ హామీ ఇచ్చారని, అందువల్ల గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేదించాలని జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖలో మురళీధర్ నొక్కిచెప్పారు.