నీళ్లున్నా నిర్లక్ష్యమే.. వాడుకోలేకపోతున్న తెలంగాణ

by Anukaran |   ( Updated:2022-08-23 11:46:53.0  )
Krishna-river-water,-cm-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లున్నా తెలంగాణ పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నది. దక్షిణ తెలంగాణకు జీవధార అయినా వినియోగంలో వెనకబడింది. ఏపీ మాత్రం కేటాయింపుల కంటే అదనంగా తరలించుకుపోతున్నది. సమైక్య రాష్ట్రంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్తూనే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హక్కుగా లభించిన వాటాను ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. దక్షిణ తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల పనులు పూర్తికాకపోవడంతోనే ఈ పరిస్థితి అనే అపవాదును మూటగట్టుకున్నది. ఏండ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు మాత్రం సాగుతూనే ఉన్నాయి. నదీ జలాలను వాడుకోవడంలో ఏపీ ప్రభుత్వం చూపతున్న ఉత్సాహం తెలంగాణలో లేదన్న విమర్శలు విస్తృతంగా వస్తున్నాయి. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును జెట్ స్పీడ్తో పూర్తి చేసిన సర్కారు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం నత్తతో పోటీ పడుతున్నదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. వాటా ప్రకారం నీటిని వినియోగించుకునేలా దృష్టి పెట్టడానికి బదులు నీళ్ల సెంటిమెంట్ను తెరపైకి తెచ్చి రాజకీయ ప్రయోజనాలకు పాకులాడుతోందని విపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.

వృథాగా సముద్రంలోకి కృష్ణమ్మ

బచావత్ ట్రిబ్యునల్ సమైక్య రాష్ట్రానికి చేసిన కేటాయింపులకు అనుగుణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాలపై తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఉంటాయి. కృష్ణా బేసిన్‌‌లోని మొత్తం నీటిలో ఏపీ, తెలంగాణ మధ్య 66 : 34 నిష్పత్తి ఫార్ములా అమలవుతున్నది. ఏపీ ప్రభుత్వం ఏటా సగటున 70 శాతంకంటే ఎక్కువ నీటినే తరలించుకుపోతున్నది. తెలంగాణ వినియోగం మాత్రం కేటాయింపుల్లో 30 శాతంలోపే ఉంటున్నది. తగినంత నీరు రానందునే వాటాను వినియోగించుకోలేకపోతున్నామనే అప్పుడప్పుడూ ఇంజనీర్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కానీ అందుకు విరుద్ధంగా వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఏపీ ప్రదర్శించిన దూకుడు తెలంగాణలో కనిపించడంలేదు. తెలంగాణ పూర్తిగా వెనకబడినట్లు తేలుతోంది. వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. గతేడాది ఏకంగా 1278 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిసినట్లు కృష్ణా బోర్డు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వాటర్ ఇయర్ లెక్కల ప్రకారం గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు 1278.12 టీఎంసీలు సముద్ర పాలయ్యాయి. అటు గోదావరిలో కూడా అదే పరిస్థితి. గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు గోదావరి నది నుంచి 3481.88 టీఎంసీలు సముద్రంలో కలిశాయి.

3474 టీఎంసీలు సముద్రానికి

తాజాగా ఈసారి కూడా చాలా ముందస్తుగా కృష్ణమ్మ ప్రవాహం మొదలైంది. నారాయణపూర్ రిజర్వాయరు నుంచి జూరాల వరకు నదీ పరివాహక ప్రాంతంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా గతంతో పోలిస్తే ఈసారి ప్రాజెక్టుల్లో నిల్వలు కూడా భారీగానే ఉన్నాయి. వరద రాకపోవడంతో పూర్తిస్థాయి వాటాను వాడుకోలేమనే సమాధానాలు గతంలో ఉన్నా… ఇప్పుడు మాత్రం ఆ సమాధానాలు తప్పుగా తేలుతోంది. 2013–14 నుంచి కృష్ణాలో భారీ వరదలే నమోదవుతున్నాయి. ఏటేటా సముద్రంలో వరద జలాలు కలుస్తున్నాయి. 2013–14 నుంచి 2020–2021 వరకు 3474 టీఎంసీలు సముద్రంలో కలిసినట్లు కృష్ణా బోర్డు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కొట్లాడి సొంత రాష్ట్రం తెచ్చుకొని ఏడేండ్లవుతున్నా ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితుల నుంచి ఇంకా బయట పడలేకపోతున్నది. అప్పటి నుంచి ఏటా 150 టీఎంసీల నుంచి 50 టీఎంసీల వరకు నీటి వాటాను కోల్పోతున్నట్లు స్పష్టమవుతోంది. వరద నీళ్లను ఒడిసి పట్టడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతున్నట్లు నీటిపారుదల శాఖ నిపుణుల అభిప్రాయం. అదే ఏపీ ప్రభుత్వం వరద మొత్తాన్ని బేసిన్‌ అవతలి రాయలసీమకు మళ్లించుకుపోతుంటే చోద్యం చూడటం మినహా ఏమీచేయలేక పోతున్నది. స్వరాష్ట్రంలో వరద జలాలతో కలిపి దాదాపు 800 టీఎంసీల వరకు నీటి వాటాను కోల్పోయిన్నట్లు స్పష్టం అవుతున్నది.

ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు

కృష్ణా నదిపై కొత్తగా ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల సాగునీటి పరిస్థితులు ఇంకా మారడం లేదనేది విపక్షాల ఆరోపణ. అయితే ఉమ్మడి ఏపీలో తలపెట్టిన ఆన్‌‌గోయింగ్‌‌ ప్రాజెక్టులు పూర్తి చేసి చెరువులు నింపడం మినహా స్వరాష్ట్రంలో సాధించింది ఏమీ కనబడటం లేదు. వాటితోనే కొంత మేరకు ఇటీవల కృష్ణాలో వాటా వినియోగం పెరిగినట్లు కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలైన ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌లో నీటి వినియోగాన్ని కేఆర్‌‌ఎంబీ తమ వార్షిక నివేదికల్లో స్పష్టం చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు లెక్కలు పరిశీలిస్తే ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర వినియోగ వాటా దాటలేదు. ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌తో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సకాలంలో పూర్తి చేయకపోవడం, కల్వకుర్తి, బీమా ఇంకా సాగుతుండటంతో కృష్ణా నీటి వినియోగంలో రాష్ట్రం వెనుకబడినట్లు అంచనా వేస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే కనీసం 150 టీఎంసీల వరకు నీటిని అదనంగా తీసుకునే అవకాశముంది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో జూరాల, దానిపై ఏర్పాటు చేసిన లిఫ్టులు, కల్వకుర్తి, నాగార్జునసాగర్‌‌ ఎడమ కాల్వ, ఏఎమ్మార్‌‌ – ఎస్‌‌ఎల్బీసీ ప్రాజెక్టులతోనే కొంత మేరకు నీటిని తరలించుకుంటున్నాం. కల్వకుర్తి కింద 20 టీఎంసీల నీళ్లు నిల్వ చేయడానికి రిజర్వాయర్లు నిర్మించాలని 2016లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే వాటిని పక్కన పెట్టి ఇప్పుడు అవే రిజర్వాయర్ల నిర్మాణం కొత్తగా చేపట్టనున్నట్టు ఇటీవల సీఎం సూచించారు. అటు జూరాల రిజర్వాయర్‌‌ ఆధారంగా నిర్మించిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌ లిఫ్టుల కాల్వలు సరిగా లేక పూర్తిగా నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆర్డీఎస్‌‌ ఆధునీకరణ, తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక గట్టు ఎత్తిపోతల పథకం, జూరాల పక్కనే 20 టీఎంసీల సామర్థ్యంతో ఇంకో రిజర్వాయర్‌‌ నిర్మాణం, ఆమ్రాబాద్‌‌ ఎత్తిపోతలు, రాచకొండ లిఫ్ట్‌‌ ఇలా అనేక ప్రాజెక్టులను ప్రకటించడమే తప్ప ప్రగతిలో లేవు. అంతకు ముందుగా ప్రకటించిన జూరాల –పాకాల గ్రావిటీ కెనాల్ కూడా కాగితాల్లో కూడా కనిపించడం లేదు. ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరంపై శ్రద్ధ పెట్టి కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఏపీ సూపర్

2019 వాటర్ ఇయర్ లో కృష్ణా బోర్డు ఏపీకి వాటాగా 302 టీఎంసీలు కేటాయిస్తే దాదాపు 470 టీఎంసీల నీటిని తరలించేశారు. దీనిపై తెలంగాణ ఫిర్యాదులు చేస్తూనే ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారానే 2019-20 నీటి సంవత్సరంలో 179 టీఎంసీల కృష్ణాజలాల్ని అవతలి పెన్నా బేసిన్‌కు తరలించారు. బేసిన్‌లో 68 శాతం ఉండే తెలంగాణకు 36.80 శాతం నీటిని కేటాయించి, 32 శాతం ఉన్న ఆంధ్రాకు 63.20 శాతం కేటాయించడమే అన్యాయం. అందులోనూ ఆంధ్రాకు కేటాయించిన 512 టీఎంసీల నీటిలో 350 టీఎంసీలకు పైగా బేసిన్‌ ఆవల ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నాయి. తెలంగాణలో నికర జలాల కేటాయింపుల్లేని ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, గట్టు తదితర ప్రాజెక్టులకు కలిపి కనీసం 575 టీఎంసీలు రావాలని తెలంగాణ అడుగుతూనే ఉంది. పోతిరెడ్డిపాడు కింద తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరునగరి, వెలిగొండ తదితర ప్రాజెక్టులకు కేటాయింపులున్నాయని, వాటి అవసరాలను తీర్చడం కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామంటూ ఇప్పుడు ఏపీ వాదనకు దిగుతోంది.

సముద్రంలో కలిసిన కృష్ణా జలాలు

ఏడాది టీఎంసీలు
2013–14 399
2015–16 93
2016–17 55
2017–18 62
2018–19 39
2020–21 1278

2019–20 269.874 టీఎంసీలు ( చెరువుల్లోకి తరలించిన జలాలతో సహా)
2018–19 207.276 టీఎంసీలు ( చెరువుల్లోకి తరలించిన జలాలతో సహా)
2017–18 110.540 టీఎంసీలు
2016–17 74.469 టీఎంసీలు
2015–16 73.654 టీఎంసీలు
2014–15 8.144 టీఎంసీలు

Advertisement

Next Story