కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు ఆంక్షలు

by Shyam |
కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు ఆంక్షలు
X

దిశ, న్యూస్ బ్యూరో
కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రమే లాక్‌డౌన్ పరిమితం చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతమున్నఆంక్షల్లో చాలా సడలింపులు చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రమే జూన్ 30 వరకూ ఆంక్షలు ఉంటాయని, మిగిలిన అన్ని ప్రాంతాల్లో జూన్ 7వ తేదీకల్లా ముగుస్తాయన్నారు.8వ తేదీ నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. అలాగే రాత్రిపూట కర్ఫ్యూలో కూడా పలు మార్పులు చేశారు. ప్రస్తుతం సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకూ అమలవుతుండగా, ఇకపైన రాత్రి 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని స్పష్టత ఇచ్చారు. దీంతో ఇకపైన కేవలం 8గంటలు మాత్రమే కర్ప్యూ ఉంటుంది. ఇప్పటివరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే, వెళ్ళే వాహనాలకు విధిగా పాస్‌లు తీసుకోవాలన్న నిబంధనను ఎత్తివేసి ఎలాంటి పాస్‌ల అవసరం లేకుండా రాకపోకలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు.ఈ రెండు సడలింపులు తక్షణం అమలులోకి వస్తున్నట్లు పేర్కొన్నారు.

మిగిలిన నిబంధనల సడలింపు మాత్రం ఈ నెల 8 నుంచి కంటైన్‌మెంట్ జోన్లు మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో అమలులోకి వస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో ప్రస్తావించిన సడలింపులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలుచేస్తుందన్నారు.కేంద్రం తాజా మార్గదర్శకాల్లో విధించిన నిషేధాలన్నింటినీ దశల వారీగా రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి సడలించనున్నట్లు తెలిపారు.కేంద్ర హోంశాఖ తాజా ఉత్తర్వులపై ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమీక్షించారు. అనంతరం పై సడలింపులతో సీఎస్ జీవో జారీ చేశారు. ఇప్పటిదాకా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే రాకపోకలపై నిషేధం ఉంది. కానీ ఇప్పుడు అలాంటి నిషేధం లేదు. మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఉన్నందున ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి నిషేధం, నిబంధనలు, పాస్‌లు లాంటి ఆంక్షలు ఉండవు.

క్వారంటైన్ సంగతేంటి?

ఇంతకాలం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి విధిగా 14రోజుల పాటు హోమ్ క్వారంటైన్, లక్షణాలు ఉన్నట్లయితే ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర మార్గదర్శకాల్లో అలాంటి నిబంధన లేనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీని గురించి నొక్కిచెప్పలేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ అనే నిబంధన దాదాపుగా తొలగిపోయినట్లే. ఇక ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళేవారికి ఆంక్షలపై ఆ రాష్ట్రాల్లోని నిబంధనల ప్రకారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్ళేవారికి విధిగా హోమ్ క్వారంటైన్ అనే నిబంధన ఉన్నందున ఆ రాష్ట్రం మళ్ళీ సడలించేంత వరకు ఇది అమలవుతుంది. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి పెట్టే నిబంధనల ప్రకారం మన రాష్ట్రం నుంచి వెళ్ళేవారికి సాధకబాధకాలు ఉంటాయి.

అంతర్ రాష్ట్ర రాకపోకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం తొలగించినందువల్ల ఇకపైన ఆర్టీసీ బస్సు సేవలు ఎలా ప్రారంభమవుతాయనేది ఆసక్తికరంగా ఉంది. ప్రైవేటు వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ ఆర్టీసీ బస్సులను నడపడంపై మాత్రం ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొనలేదు. మతపరమైన ప్రార్థనాలయాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లాంటివి దశలవారీగా తెరుచుకోడానికి కేంద్రం మార్గదర్శకాల్లో ప్రస్తావన చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటి గురించి ఈ జీవోలో వెల్లడించలేదు.కావున ఈ నెల 7 తర్వాత ఇవి తెరుచుకుంటాయా లేదా అనేదానిపై సీఎం అప్పటిలోగా వివరణ ఇవ్వనున్నారు.

Advertisement

Next Story