ట్రాన్స్‌లొకేట్ పేరుతో వేల చెట్లు నాశనం.. తెలంగాణ ప్రభుత్వంపై నెట్టింట ఫైర్

by Shyam |   ( Updated:2021-12-27 08:13:21.0  )
killing trees
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణకు హరితహారం పేరుతో వందల కోట్ల మొక్కలను ప్రతి ఏటా నాటడం చూస్తున్నాం. అయితే, నాటిన మొక్కలలో ఎంత శాతం బతికి చెట్లు అవుతున్నాయని శాస్త్రీయంగా ఎలాంటి లెక్కలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో గతేడాది నాటిన ప్రాంతంలోనే పక్కనే ఈ ఏడాది మరో మొక్కను నాటడం చూస్తుంటాం. అంతేకాకుండా కొన్ని చోట్ల నాటిన మొక్కలు పశువులు, మేకలకు ఆహారం అయిన సందర్భాలు దర్శనమిచ్చాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణకు హరితహారంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం భారీగా పెరిగిందని అటవీ శాఖ చెబుతోంది. తాజాగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అటవీ విధ్వంసంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మొక్కల నాటడంతో పాటు ఏళ్ల వయసు ఉన్న చెట్లను నరకడంలోనూ తెలంగాణ టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు తదితర కారణాలతో ఆయా ప్రదేశాల్లో ఉన్న భారీ వృక్షాలను నరికివేయకుండా, ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో వేరే ప్రదేశంలో ఆ చెట్లను నాటుతుంటారు. అయితే, నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగకపోవడంతో వేలాది వృక్షాలు చనిపోతున్నాయి. ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ ఇటు చెట్లు చనిపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు.

తాజాగా, ‘వట ఫౌండేషన్’ తన ట్విట్టర్ అకౌంట్లో.. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో రోడ్డుకిరువైపులా వాడిపోయిన చెట్లను వీడియో తీసి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ట్యాగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇలాంటి అనాగరిక చర్యలను అరికట్టాలని ‘వట ఫౌండేషన్’ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా వందలాది మొక్కలు రోడ్డుకిరువైపులా వాడిపోయి కనిపించడం బాధాకరమని ట్వీట్లు చేస్తున్నారు. ఇలా ట్రాన్స్‌లొకేట్ పేరుతో వేలాది చెట్లను నాశనం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శిస్తు్న్నారు.

Advertisement

Next Story

Most Viewed