హంద్రీనీవాను ఆపండి.. ఏపీపై తెలంగాణ ఫిర్యాదు

by srinivas |
Handrineeva
X

దిశ, తెలంగాణ బ్యూరో : హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ సోమవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విస్తరణ పనులు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. అనుమతుల్లేకుండా విస్తరణ పనుల కోసం టెండర్లు పిలిచిందని, విస్తరణ పనులను వెంటనే నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి ఈఎన్సీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు.

ఏపీ ప్రభుత్వం 34 టీఎంసీల పైచిలుకు నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాడుకుంటోందని, మిగులు నీటి ఆధార ప్రాజెక్టులు, అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి 3,850 క్యూసెక్కుల బదులు 6,300 క్యూసెక్కుల వినియోగిస్తుందని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి పలు దఫాలుగా ఫిర్యాదులు చేసిందని వివరించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన టెండర్​నోటిఫికేషన్​ప్రకటనను ఈ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ నీటివాటాలను తేల్చే వరకు ఈ ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం నీరు తీసుకోకుండా నిలువరించాలని గతంలో తెలంగాణ కేఆర్​ఎంబీని కోరిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బోర్డు చైర్మన్‌కు ఆగస్టులోనే లేఖ రాసినట్లు ఈఎన్సీ మురళీధర్ గుర్తు చేశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలాశయం జలవిద్యుత్‌కు ఉద్దేశించినదేనని, అక్కడి నుంచి కృష్ణా బేసిన్ వెలుపలకు నీటి తరలింపునకు ట్రైబ్యునల్ అనుమతించలేదన్నారు. వరద జలాలపై ఆధారపడి నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం.. కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందని, దీంతో బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయన్నారు. నది ఒడ్డునున్న తెలంగాణ ప్రాంతాలను కాదని బేసిన్ వెలుపల 700 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి నుంచి తుంగభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నందున బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు కూడా చేయలేదని, ఇది ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని అన్నారు.

మిగులు జలాలపై ఆధారపడి బేసిన్ వెలుపలకు నీటిని తీసుకెళ్లే హంద్రీనీవా ప్రాజెక్టునే తాము వ్యతిరేకిస్తుంటే సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమని తెలంగాణ ఈఎన్సీ లేఖలో పేర్కొన్నది. వరద జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరుతోందని, ఆంధ్రప్రదేశ్ మాత్రం విజ్ఞప్తి చేయడం లేదని అన్నారు. వీటన్నింటి నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వాటాలు ఖరారు చేసే వరకు హంద్రీనీవా నుంచి నీటిని తరలించకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed