- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూమి కారవాన్-2 ప్రారంభం!
దిశ, తెలంగాణ బ్యూరో: మెరుగైన విధానాలు, చట్టాలు రూపొందించాలంటే క్షేత్ర స్థాయి పరిశీలన అవసరం. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలన్నా, చట్టబద్ధ పాలన ఉండాలన్నా ప్రజలను భాగస్వాములను చేయాలి. వారి అభిప్రాయాలేమిటో తెలుసుకోవడం అనివార్యం. అరుదుగా మాత్రమే ప్రజలను చట్టాలు, విధానాల రూపకల్పనలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రభుత్వాలు పేదల న్యాయ అవసరాలను అర్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ప్రజలతో మమేకమై వారికేం కావాలో తెలుసుకునేందుకు సివిల్ సొసైటీ, రాజకీయ పార్టీలు అధ్యయనం చేయాలి. కానీ అన్ని పార్టీలు ప్రజాభిప్రాయం తెలుసుకోకుండానే మానిఫెస్టోలను రూపొందిస్తున్నాయి. కానీ 2014 లో తెలంగాణా కొత్త రాష్ట్రంగా ఏర్పడుతున్న సందర్భంలో భూమి హక్కులు, భూపరిపాలనకు సంబంధించి ప్రజల ఆకాంక్షలు ఏమిటో తెలుసుకోవడానికి లీఫ్స్(లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ) ఆధ్వర్యంలో భూమి కారవాన్ నిర్వహించారు.
ఆ సంస్థ సభ్యులు భూమి కారవాన్ పేరుతో తెలంగాణ అన్ని జిల్లాల్లో దాదాపు 2500 కి.మీ. తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనిలో భాగంగా 5 వేల మందితో మాట్లాడారు. వాటి ఆధారంగా ‘తెలంగాణా ప్రజల భూమి మానిఫెస్టో’ రూపొందించారు. ఈ మానిఫెస్టో లోని చాలా అంశాలు గత రెండు ఎన్నికల రాజకీయ పార్టీల మానిఫెస్టోల్లో వచ్చాయి. గడిచిన తొమ్మిదేళ్లలో కొన్ని అంశాలను ప్రభుత్వం అమలు చేసింది. అందుకే చారిత్రక రోజు(10 ఏప్రిల్), ఒక చరిత్రాత్మక ప్రదేశం(భూదాన్ పోచంపల్లి) నుంచి లీఫ్స్ సంస్థ తెలంగాణా భూమి కారవాన్ - 2 ను ప్రారంభిస్తుంది. 1917 లో ఇదే రోజు మహాత్మా గాంధీ, ప్రముఖ న్యాయవాదులతో కలిసి చంపారన్ లో రైతుల కోసం పని చేయడం ఆరంభించారు. చంపారన్ ఉద్యమ వందేళ్ల ఉత్సవాల పూర్తవుతున్న సందర్భంగా 2018 లో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీని కొంత మంది న్యాయవాదులు కలిసి ప్రారంభించారు. ఇప్పుడు అదే రోజున ఆచార్య వినోబా భావే మొదటి భూదానం స్వీకరించిన చెట్టు కింద నుంచి భూమి కారవాన్ ప్రారంభిస్తున్నట్లు లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జి.జీవన్ రెడ్డి, సలహాదారు దేశాయి కరుణాకర్ రెడ్డిలు శనివారం ‘దిశ’కు వివరించారు. ఏప్రిల్, మే నెలలో తమ టీం తొమ్మిదేళ్ల క్రితం ప్రయాణించిన దారిలోనే తెలంగాణాంత తిరిగి రైతులతో మాట్లాడుతుందన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
భూమి కారవాన్ నిర్వహించి తొమ్మిదేండ్లవుతుంది. ఇన్నేండ్లలో ప్రజల ఆకాంక్షలు కొన్ని నెరవేరాయి. కొన్ని భూమి సమస్యలు తీరాయి. మరికొన్ని సమస్యలు ఉద్భవించాయి. ఇప్పటి ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడానికి మరోసారి భూమి కారవాన్ ని నిర్వహించ తలపెట్టారు. ఇప్పటికే లీఫ్స్ సంస్థ ద్వారా భూమి, వ్యవసాయానికి సంబంధించి రైతుల న్యాయపరమైన అవసరాలను తీర్చే ప్రయత్నాలు చేశారు. రైతుల కోసం భూమి హక్కుల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాగున్యాయం కార్యక్రమం ద్వారా వారికి ఉచిత న్యాయసేవలు అందిస్తున్నారు. భూన్యాయ శిబిరాలను నిర్వహిస్తూ రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నారు. భూమి, వ్యవసాయ చట్టాలపై రైతుల కు అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు చేశారు. గ్రామీణ యువతకు సాగు న్యాయనేస్తాలుగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతివారం న్యాయ గంట కార్యక్రమం ద్వారా రైతులకు ఫోన్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నారు. కారవాన్ ద్వారా రైతుల న్యాయ అవసరాలను తెలుసుకోవాలనుకుంటున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
అధ్యయనమిదే
లీఫ్స్ ప్రతినిధులు రైతులను పొలాలు, తహశీల్దార్ కార్యాలయం, మీ సేవా కేంద్రాలు, రచ్చబండ కేంద్రాల్లోనే కలుస్తారు. భూ సమస్యల పరిస్కారానికి, మరింత మెరుగైన భూపరిపాలన కోసం ప్రభుత్వం ఇంకా ఏమి చెయ్యాలి? సాగుకు సంబంధించి రైతుల న్యాయ అవసరాలు ఏమిటి? వంటి ప్రశ్నలకు రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. వాటి ఆధారంగా మరో సారి తెలంగాణ ప్రజల భూమి మానిఫెస్టోని రూపొందిస్తారు. రైతుల న్యాయ అవసరాలపై నివేదిక తయారు చేస్తారు.
తెలంగాణ భూమి కారవాన్ - 2
రూట్ మ్యాప్: ఏప్రిల్ 10న
– పోచంపల్లి, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా (ఉదయం 6 గంటలకు)
– దోతిగూడెం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
– చౌటుప్పల్, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా (ఉదయం 10 గంటలకు)
– గుడ్డిమల్కాపురం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
– సంస్థాన్ నారాయణ్ పూర్, సంస్థాన్ నారాయణ్ పూర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా (మధ్యాహ్నం 12 గంటలకు)
– పుట్టపాక, సంస్థాన్ నారాయణ్ పూర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
– మునుగోడునల్గొండ జిల్లా (మధ్యాహ్నం 2 గంటలకు)
– చండూరు, నల్గొండ జిల్లా (మధ్యాహ్నం 3 గంటలకు)
– నాంపల్లినల్గొండ జిల్లా (సాయంత్రం 4 గంటలకు)
– పసునూరు, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా
– మల్లేపల్లి, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా (సాయంత్రం 6 గంటలకు)
రైతు ఆశిస్తున్నదేమిటి?: ప్రొ.ఎం.సునీల్ కుమార్, రెవెన్యూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్
తెలంగాణ వచ్చి ఇన్నేండ్లయ్యింది. కానీ భూమి సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. అసలు రైతులు ఆశిస్తున్నదేమిటి? సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇవి తెలుసుకునేందుకే కారవాన్ 2 ని నిర్వహిస్తున్నాం. రైతుల భాగస్వామ్యంతోనే పరిష్కారాలు లభిస్తాయి. ఏదైనా వారి భాగస్వామ్యం లేకుండా సక్సెస్ కాదు. సమస్యలకు పరిష్కారం రైతులైతేనే సింపుల్ గా చెప్తారు. అందుకే వారితో ఇంటరాక్ట్ అవుతాం. ర్యాండమ్ చెకింగ్ చేస్తాం. ఇదే శాస్త్రీయ అధ్యయనం. ఏసీల్లో కూర్చుంటే పరిష్కార మార్గాలు దొరకవు. ఈ పని ఎవరో చేయాలి. సివిల్ సొసైటీలు, రాజకీయ పార్టీలు చేయాలి. కానీ వారు చేయడం లేదు. అందుకే మేం గ్రాస్ రూట్స్ లోకి వెళ్లి అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యాం. కారవాన్ ద్వారా రాష్ట్రమంతటా పర్యటిస్తాం. భూ సమస్యలు, పరిష్కార మార్గాలు, రైతులు కోరుతున్న డిమాండ్లతో కూడిన నివేదికను రూపొందిస్తాం. జూన్ 2న దాన్ని రైతు మానిఫెస్టోగా ఆవిష్కరిస్తాం.