పాస్‌వర్డ్ తెలిసినా దొంగలించలేరు.. యాపిల్ కొత్త 'ప్రొటెక్షన్' ఫీచర్

by S Gopi |
పాస్‌వర్డ్ తెలిసినా దొంగలించలేరు.. యాపిల్ కొత్త ప్రొటెక్షన్ ఫీచర్
X

దిశ, టెక్నాలజీ: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా మొబైల్‌ఫోన్ ఎవరైనా దొంగలిస్తే అందులోని సమాచారాన్నంతా సేకరిస్తారు. ఒకవేళ ఫోన్‌కు ఉన్న పాస్‌వర్డ్ కూడా తెలిసి ఎవరైన దొంగతనం చేస్తే ఇక అంతే సంగతులు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్ పరికరాలను దొంగతనాల నుంచి రక్షించేందుకు 'స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ ' సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాపిల్ తెచ్చిన ఈ సదుపాయంతో ఎవరైనా పాస్‌వర్డ్ తెలిసి దొంగతం చేసినప్పటికీ ఫోన్‌కు రక్షణ ఉంటుంది. యాపిల్ తన కొత్త ఐఓఎస్ వెర్షన్ 17.4లో దీన్ని అందిస్తోంది. సెట్టింగ్స్‌లో ఉండే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకున్న తర్వాత ఐఫోన్ లేదా ఐప్యాడ్ వాటిని వాడుతున్న వ్యక్తి ఇంటితో పాటు ఆఫీస్ పరిసరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. తరచుగా వెళ్లే ప్రదేశాలు కాకుండా కొత్త ప్రదేశాల్లో డివైజ్‌ను ఎవరైనా యాక్సెస్ చేయాలని ప్రయత్నిస్తే స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అవుతుంది. సదరు ఐఫోన్, ఐప్యాడ్‌కు అడిషనల్ సెక్యూరిటీని యాడ్ చేస్తుంది. ఆ తర్వాత డివైజ్‌ను యాక్సెస్ చేసేందుకు ఖచ్చితమైన ఫేస్ ఐడీ లేదంటే టచ్ ఐడీని స్కాన్ చేయాల్సిందే.

Advertisement

Next Story