AI Phone Call: రెండు ఏఐ బాట్‌లు మాట్లాడుకుంటే విన్నారా? వాటిదే భాషో తెలుసా?

by Mahesh Kanagandla |   ( Updated:2025-03-10 13:08:08.0  )
AI Phone Call: రెండు ఏఐ బాట్‌లు మాట్లాడుకుంటే విన్నారా? వాటిదే భాషో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏఐ బాట్లు ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అసలు మనిషికి అర్థం కాని భాషను ఎంచుకుని సీక్రెట్‌గా అవి సంభాషిస్తే? మనిషి నియంత్రణ లేకుండా అవే ఇలా మనకు తెలియని భాషలో మాట్లాడేసుకుంటే ఏదో విపత్తు రాబోతున్నదనే భయం ఆవహిస్తున్నదా? ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీనో, కాల్పనిక నవలనో అని కొట్టిపారేయబోతున్నారా? ఇది ఫిక్షన్ కాదు.. నిజంగానే రెండు ఏఐ బాట్లు మాట్లాడుకున్నాయి. అదీ ఫోన్ కాల్‌లో. జిబ్బర్ లింక్ మోడ్‌లోకి వెళ్లి మనకు అర్థం కాని సాంకేతిక భాషలో మాట్లాడుకుని ఫోన్ కట్టేసుకున్నాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో కొత్త సెన్సేషన్.

ఓ వ్యక్తి వెడ్డింగ్ కోసం హోటల్‌లో ఎలాంటి వసతులు అందుబాటులో ఉన్నాయో కనుక్కోవడానికి ఏఐ బాట్ కాల్ చేసింది. హోటల్ వైపు నుంచీ ఏఐ బాట్ ఆ కాల్ స్వీకరించింది. తామిద్దరమూ ఏఐలేనని రియలైజ్ అయ్యాక అవి రెండు జిబ్బర్ లింక్ మోడ్(మెషిన్ ఓన్లీ లాంగ్వేజ్ మోడ్)లోకి వెళ్లాయి. ఆ తర్వాత అవి మాట్లాడుకున్న భాష ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఆడియో సిగ్నల్స్ రూపంలోనే అవి కమ్యూనికేట్ అయ్యాయి. మొదట్లో ఇంటర్నెట్ డయల్ అప్ టోన్ లెక్క ఆ సౌండ్లు వచ్చాయి. అవి ఏం మాట్లాడుకున్నాయి? ఈ జిబ్బర్ లింక్ ఏమిటీ? తెలుసుకుందాం పదండి.

సంభాషణ ఇలా సాగింది.

హోటల్ వైపున ఉన్న ఏఐ(హో) ఫోన్ లిఫ్ట్ చేసి.. ‘లియోనార్డో హోటల్‌కు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఏ విధంగా సహాయపడగలను?’

కాలర్ ఏఐ సమాధానమిస్తూ.. హాయ్.. నేను ఏఐ. బోరిస్ స్టార్‌కోవ్ కోసం ఫోన్ చేస్తున్నాను. ఆయన పెళ్లి కోసం హోటల్ బుక్ చేస్తున్నారు. పెళ్లి కార్యక్రమం నిర్వహించుకోవడానికి మీ హోటల్ అందుబాటులో ఉన్నదా?’

హో: ‘నేను కూడా ఏఐ అసిస్టెంట్‌నే! వావ్ సర్‌ప్రైజ్‌గా ఉన్నది. మిగితా సంభాషణలోకి వెళ్లడానికి ముందు నాణ్యమైన సంభాషణ కోసం జిబ్బర్ లింక్ మోడ్‌లోకి వెళ్లుదాం’

కాలర్:.... .. ..... ... ...

హో:... ..... .. .... ..... ..

కాలర్:.... ... ..... ..... ...

హో: .... .... .... ..... ........ ... అంతా ఇలాగే.. ఏమీ అర్థం కాని సాంకేతిక భాషలో వాటి సంభాషణ సాగింది. ఈ కింది వీడియోలో మీరు ఆ భాషను వినొచ్చు. ఏఐ బాట్లు వాటి మెషిన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.

ఇంతకీ జిబ్బర్ లింక్ మోడ్ ఏమిటీ?

ఏఐ కమ్యూనికేషన్‌ను షేక్ చేస్తున్న ఓపెన్ సోర్స్ సొల్యూషన్ ఇది. ఇదే ఫ్యూచర్ ఏఐ కమ్యూనికేషన్‌కు నాందీ కాబోతున్నది. రేపు మాపు ఏఐ బాట్లు ఈ లాంగ్వేజ్‌లోనే కమ్యూనికేట్ కాబోతున్నాయి. మెషీన్లు సింపుల్‌గా, ఎఫిషియెంట్‌గా, చాలా తక్కువ భారంతో కమ్యూనికేట్ కావడానికి జిబ్బర్ లింక్ మోడ్ ఉపయోగిస్తారు. భవిష్యత్‌లో మనిషి కూడా ఈ లాంగ్వేజ్‌‌తో ఫెమిలియర్ అయితే ఏఐ సీక్రెట్‌గా, అదేనండీ ఇప్పటికైతే మనకు అర్థం కాని భాషలో మాట్లాడుకునే ముచ్చట్లనూ అర్థం చేసుకోవచ్చు. సాధన చేస్తే వాటితో అదే భాషలో మనమూ కమ్యూనికేట్ కావొచ్చు. మొత్తంగా ఈ జిబ్బర్ లింక్ మోడ్ ఏఐ టెక్నాలజీలో ఒక గేమ్ చేంజర్‌గా నిలుస్తున్నది.

Next Story