రిలయన్స్‌కు టీసీఎస్ గట్టి పోటీ!

by Shyam |
రిలయన్స్‌కు టీసీఎస్ గట్టి పోటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: మిలినియల్స్ తరంలో అత్యంత వేగంగా, ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్. సరికొత్త ఆలోచనలతో ఇప్పటి తరాన్ని ఆకట్టుకునే నిర్ణయాలతో రిలయన్స్ సంస్థ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. మార్కెట్ వర్గాలు సైతం రిలయన్స్ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఉంటాయని నమ్ముతున్నాయి. ముఖేశ్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ సంస్థ అధిక లాభాల జాబితాలో ఉంది. అయితే, ఇటీవల కరోనా వ్యాప్తి కారణంగా సంస్థ ప్రధాన వ్యాపారమైన చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ పరిణామాలతో 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ లాభాలు క్షీణించాయి. అంతేనా..దేశంలోనే అత్యధికంగా లాభాలను ఇచ్చే రిలయన్స్ సంస్థను ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ దాటేయడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసికంలో టీసీఎస్ రూ. 8,049 కోట్ల లాభాలను నమోదు చేసింది. అయితే, నష్టాలను ఎదుర్కొన్న రిలయన్స్ సంస్థ మాత్రం రూ. 6,348 కోట్లను మాత్రమే నమోదు చేసింది. రిలయన్స్ లాభాలు 39 శాతం తగ్గితే, టీసీఎస్ లాభం మాత్రం కేవలం 1 శాతమే క్షీణించింది. అయితే, టెలికాం రంగంలో దూకుడుతో జియో వల్ల రిలయన్స్‌కు నష్టం తక్కువగానే నమోదైంది. ఒకవేళ జియో గనక గట్టెక్కించకపోతే రిలయన్స్‌కు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. ముఖ్యంగా రిలయన్స్‌పై చమురు ధరల పతనం ప్రభావం అధికంగా ఉంది.

రెండుసార్లు టీసీఎస్ హవా..

రిలయన్స్ సంస్థ సుమారు రెండు దశాబ్దాల పాటు అత్యధిక లాభాలను అందించిన సంస్థగా అగ్రస్థానంలో కొనసాగింది. నిర్వహణ లాభం, మొత్తం ఆదాయం, ఆస్తులు, నికర విలువ, మార్కెట్ మూలధనం ఇలా అన్నిరకాల ఆర్థికపరమైన అంశాల్లో టీసీఎస్‌ను రిలయన్స్ అధిగమిస్తూ వచ్చింది. అలాంటి రిలయన్స్ సంస్థను టీసీఎస్ రెండుసార్లు అధిగమించింది. 2014 డిసెంబర్ త్రైమాసికంలో తొలిసారి అధిగమించింది. తర్వాత ఈ ఏడాది చివరి త్రైమాసికంలో దాటింది. అంతర్జాతీయంగా చమురు ధరల పతనం కారణంగా రిలయన్స్ సంస్థ 30 త్రైమాసికాల అనంతరం నికర లాభంలో తగ్గుదలను నమోదు చేసింది.

ఎమ్-క్యాప్‌లోనూ…

తొలి నుంచి టీసీఎస్ సంస్థ రిలయన్స్‌కు గట్టి పోటీని ఇస్తోంది. 2012 ఏడాది వరకూ దాదాపు పదేళ్లు రిలయన్స్ సంస్థ మార్కెట్ మూలధనంలో తొలిస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆ ఏడాది టీసీఎస్ సంస్థ మార్కెట్ మూలధనంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2012 నుంచి 5 ఏళ్ల వరకూ టీసీఎస్ అగ్రస్థానంలో కొనసాగగా, ప్రతిష్టాత్మకంగా రిలయన్స్ ప్రారంభించిన జియో స్పీడ్‌తో 2018 ప్రారంభంలో మళ్లీ రిలయన్స్ తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ రుణాలను తగ్గించుకునేందుకు ఆరామ్‌కో కంపెనీకి చమురు వాటా అమ్మకాల నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో పెట్టుబడిదారులు రిలయన్స్ షేర్‌లను వేలం వేయడంతో 2018 చివరి త్రైమాసికంలో మార్కెట్ మూలధనంలో టీసీఎస్ మళ్లీ అగ్రస్థానానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ వివరాల ప్రకారం రిలయన్స్ మార్కెట్ మూలధనం రూ. 9.3 లక్షల కోట్లు ఉండగా, టీసీఎస్ మార్కెట్ మూలధనం రూ. 7.6 లక్షల కోట్లు.

Tags : coronavirus, reliance industreies limited, reliance market cap, tcs market cap, tata consultance services, reliance jio, covid-19

Advertisement

Next Story