T20 WorldCup: కాసేపట్లో ఫస్ట్ సెమీ ఫైనల్ మ్యాచ్

by Shyam |
New Zealand vs England
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫస్ట్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్‌లోని షేక్ జాయెద్ అబుదాబి స్టేడియం వేదికగా కాసేపట్లో(సాయంత్రం 07:30) మ్యాచ్ జరుగనుంది. కాగా, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓడిపోయింది. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని కేన్ సేన భావిస్తోంది. ఇంగ్లాండ్‌పై విజయమే లక్ష్యంగా న్యూజిలాండ్‌ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టును గాయాలు వెంటాడుతున్నప్పటికీ మోర్గాన్ నాయకత్వంలోని ప్రస్తుత జట్టు పటిష్టంగానే ఉంది. కివీస్ జట్టులో మార్టిన్ గప్తిల్‌, డారిల్ మిచెల్‌, కేన్ విలియమ్సన్‌, దేవాన్ కాన్వే, గ్లేన్ ఫిలిప్స్‌, జేమ్స్ నీషమ్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగానే కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌తో ప్రత్యర్థిని న్యూజిలాండ్‌ గొప్పగా కట్టడి చేస్తోంది.

ఇక, ఇంగ్లాండ్ జట్టు సైతం ఓపెనర్ జోస్ బట్లర్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక అతనికి తోడుగా బెయిర్‌స్టో, డేవిడ్ మలన్‌, ఇయాన్ మోర్గాన్‌, లియామ్ లివింగ్‌స్టోన్‌, సామ్ బిల్లింగ్స్‌, మొయిన్‌ అలీ, ఏ ఇద్దరైనా ప్రతాపం చూపిస్తే భారీ స్కోర్ ఖాయం. ఇక బౌలింగ్ లో స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌ గొప్పగా రాణిస్తున్నారు. పేసర్లు మార్క్‌ వుడ్‌, క్రిస్ వోక్స్‌, క్రిస్ జోర్డాన్‌ ఆఖరి ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తే ఆ జట్టుకు తిరుగుండదు. మొత్తానికైతే ఇరు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహమే లేదు. మరి ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.

Advertisement

Next Story