వచ్చే ఏడాది ఆటో పరిశ్రమకు కొత్త సమస్యలు!

by Harish |
Auto industry in India
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటో పరిశ్రమ వచ్చే ఏడాది వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు, గ్లోబల్ సెమీకండక్టర్ల కొరత సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ఎంజీ మోటార్ ఇండియా అభిప్రాయపడింది. ప్రస్తుత ఏడాదిలో దేశీయ మార్కెట్ మెరుగైన డిమాండ్‌ను సాధించింది. ఇదే సమయంలో సెమీకండక్టర్ల కొరత వల్ల భారీగా ఉత్పత్తిని కోల్పోయింది. తాజా పరిస్థితులు పరిశ్రమకు కొత్త సవాళ్లను తీసుకొచ్చింది. వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడంతో పాటు సంస్థ, వాటాదారుల ఆర్థికపరమైన కష్టాల నుంచి గట్టెక్కడం అతిపెద్ద సవాళ్లు కానున్నాయి. గత రెండేళ్లుగా ఆటో పరిశ్రమ పలు సమస్యలను ఎదుర్కొంటోందని, రాబోయే ఏడాది సానుకూలంగా ఉండాలని ఆశిస్తున్నట్టు’ ఎంజీ మోటార్ ఇండియా ఎండీ రాజీవ్ చాబా అన్నారు.

కానీ కొవిడ్-19 కొనసాగుతుండటం, గ్లోబల్ సెమీకండక్టర్ల కొరత, సరఫరా సమస్యలు, వ్యయభారం లాంటి అనేక ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే సమయంలో తాము వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌ను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచనున్నట్టు రాజీవ్ చాబా పేర్కొన్నారు. ఇక, వాహన పరిశ్రమలో వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను పటిష్ఠం చేయనున్నామని రాజీవ్ చాబా చెప్పారు. ఇప్పటికే విడుదల చేసిన జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనం కోసం నెలకు సగటున 700 బుకింగ్‌లు వస్తున్నాయని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed