రాజ్యసభలో మళ్లీ గందరగోళం

by Shamantha N |
రాజ్యసభలో మళ్లీ గందరగోళం
X

న్యూఢిల్లీ: రాజ్యసభలో మళ్లీ గందరగోళం రేగింది. ప్రతిపక్ష నేతల నిరసనలు అలాగే కొనసాగాయి. రెండు వ్యవసాయ బిల్లుల ఆమోదానికి సంబంధించి ఆదివారం నినాదాలు, అరుపులు, నిరసనలతో రాజ్యసభ హోరెత్తిన సంగతి తెలిసిందే. ఈ రభసకు కారకులుగా భావిస్తూ ఎనిమిది మంది ఎంపీలపై సభ చైర్మన్ వెంకయ్యనాయుడు వేటు వేశారు. ఈ సమావేశాలకు హాజరుకావద్దని సస్పెండ్ చేశారు. కానీ, సదరు ఎంపీలు సభ విడిచిపెట్టడానికి ససేమిరా అన్నారు. వారు విడిచివెళితే ఇతర విపక్ష నేతలకు మాట్లాడటానికి అవకాశమిస్తారని చైర్మన్, సభా ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు హామీనిచ్చారు. అలాగే, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై ప్రతిపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మాన నోటీసులను తిరస్కరించారు. ఈ తీర్మానానికి సరైన ప్రక్రియను అనుసరించలేదని, ముందస్తుగా 14 రోజుల నోటీసు అవసరముంటుందని పేర్కొన్నారు.

ఆదివారం నాటి ఘటనలు వివరిస్తూ ఎనిమిది మంది ఎంపీలు డెరెక్ ఓబ్రియన్, సంజయ్ సింగ్, రాజీవ్ సతావ్, కేకే రాగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమారన్ కరీమ్‌లను సమావేశాల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఓటింగ్‌నూ డివిజన్ పద్ధతిలో నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీన్ని మూజువాణి ద్వారా ఆమోదించారు. ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు కొనసాగించారు. డెరెక్ ఓబ్రియన్ నిరసనలు కొనసాగిస్తూనే ఉండగా, వెంకయ్యనాయుడు డెరెక్ ఓబ్రియన్‌ను సభ విడిచి పెట్టి వెళ్లాల్సిందిగా కోరాడు. కానీ, సస్పెన్షన్ వేటుపడ్డ నేతలు సభ వదల్లేదు. నిరసనలు కొనసాగాయి. దీంతో సభ పలుసార్లు వాయిదా పడింది.

భౌతికంగా బెదిరించారు : వెంకయ్యనాయుడు

‘నిన్న సభలో జరిగిన పరిణామాలపట్ల బాధపడుతున్నాను. కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. రాజ్యసభకు నిన్నటి రోజు ఒక దుర్దినం. డిప్యూటీ చైర్మన్‌ను భౌతికంగా బెదిరించారు. సభాపతిని, సమావేశాలను అడ్డుకునే హక్కు మీకు లేదు. నిన్నటి పరిణామాలు సభా మర్యాదను మంటగలుపుతుంది’ అని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు.

Advertisement

Next Story