‘ఉపా’పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు పరిశీలిస్తాం : సుప్రీంకోర్టు

by Shamantha N |
‘ఉపా’పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు పరిశీలిస్తాం : సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: గతేడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో నిందితులు నతాషా నర్వాల్, దేవాంగన కలిత, ఆసిఫ్ ఇక్బాల్ తాన్హాలకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యానాలను పరిశీలిస్తామని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం నిర్ణయించింది. ముగ్గురు కార్యకర్తలకు మంజూరు చేసిన బెయిల్‌పై ప్రస్తుత దశలో స్టే విధించలేమని, ఆ బెయిల్ యథాతథంగా అమలవుతుందని స్పష్టం చేసింది.

ఢిల్లీ హైకోర్టు ఉపా చట్టంపై చేసిన వ్యాఖ్యలను వచ్చే నెలలో పరిశీలిస్తామని వివరించింది. ఇంతలోపు ఇతర న్యాయస్థానాలు వీటిని ప్రాతిపదిక చేసుకుని రూలింగ్ ఇవ్వరాదని సూచనలు చేసింది. హైకోర్టు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక చట్టంపై తప్పుడు అవగాహనకు కారణమయ్యేలా ఉన్నాయని, దుర్వినియోగానికి దోహదపడే ముప్పూ ఉన్నదని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ల ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అసమ్మతిని అణచివేసే ఉబలాటంతో ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కుకు, ఉగ్రవాదానికి మధ్యనున్న గీతను చెరిపేసే ప్రయత్నం చేసిందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. చట్టం అనుమతించిన పరిధిలోనే అప్పుడప్పుడు ఆందోళనలు హింసాత్మకం కావచ్చనీ వ్యాఖ్యలు చేసింది.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఉపా చట్టాన్ని నీరుగార్చి తలకిందులు చేసిందని, అల్లర్లను అదుపు చేయగలిగినందున అది నేరం కాదనీ పేర్కొనడం సరికాదని పోలీసుల తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా వాదించారు. ఒకచోట బాంబు పెట్టిన విషయం గుర్తించి బాంబు స్క్వాడ్‌లు దాన్ని నిర్వీర్యం చేస్తే ఆ నేరం నేరం కాకుండా పోతుందా? అని ప్రశ్నించారు. బెయిల్ ఆదేశాల కోసమే మొత్తం ఉపా చట్టాన్ని విశ్లేషించి, వ్యాఖ్యలు చేసిందనీ అన్నారు. బెయిల్ ఆదేశాల కోసం అంత సుదీర్ఘ విశ్లేషణలు అనవసరమని, తమకూ ఆశ్చర్య వేసిందని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల పరీశీలనకు కార్యకర్తల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కూడా అంగీకరించారు. దీంతో ముగ్గురు కార్యకర్తలకూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed