మొహర్రం ఊరేగింపునకు ‘సుప్రీం’ నో

by Anukaran |   ( Updated:2020-08-27 07:26:30.0  )
మొహర్రం ఊరేగింపునకు ‘సుప్రీం’ నో
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొహర్రం ఊరేగింపునకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. కరోనా నేపథ్యంలో ఈ ఊరేగింపును అనుమతిస్తే గందరగోళం నెలకొంటుందని, మహమ్మారిని వ్యాపించారన్న అపవాదుకు ఒక ప్రత్యేక వర్గం గురికావాల్సి వస్తుందని సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ప్రత్యేకంగా ఒక వర్గం లక్ష్యంగా మారవద్దని భావిస్తున్నట్టు పేర్కొంది.

శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా మొహర్రం ఊరేగింపునకు అనుమతించాలని యూపీకి చెందిన సయ్యద్ కాల్బే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పూరి జగన్నాథ్ యాత్రకు అనుమతించినట్టే మొహర్రం ఊరేగింపునూ అనుమతించాలని అభ్యర్థించారు. పూరి యాత్ర ఒక ప్రాంతంలో నిర్దేశిత రూట్‌లో నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చామని, అందులో కరోనా రిస్క్‌ను సమీక్షించవచ్చునని సీజేఐ తెలిపారు.

కానీ, ఈ పిటిషన్ దేశవ్యాప్తంగా అనుమతిని కోరుతున్నదని, ప్రజలందరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని అన్నారు. ఒక ప్రాంతానికే అనుమతి కోరితే, సమీక్షించేవారని వివరించారు. దేశవ్యాప్తంగా అనుమతినివ్వలేమని, రాష్ట్ర ప్రభుత్వాలూ పిటిషన్‌లో భాగంగా లేవని తెలిపారు. యూపీ రాజధాని లక్నోలో ఊరేగింపునకు అనుమతినివ్వాలని పిటిషనర్ కోరగా, అలహాబాద్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది.

Advertisement

Next Story