డాక్టర్ అంబేద్కర్ కూడా ఇదే సమస్య వచ్చి ఉంటుంది- ఎస్ఏ బాబ్డే

by Shamantha N |   ( Updated:2021-04-14 07:53:33.0  )
డాక్టర్ అంబేద్కర్ కూడా ఇదే సమస్య వచ్చి ఉంటుంది- ఎస్ఏ బాబ్డే
X

న్యూఢిల్లీ: జాతీయ అధికారిక భాషగా సంస్కృతాన్ని అమలు చేయాలని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశించారు కానీ, ఆయన చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నేషనల్ లా యూనివర్సిటీ కొత్త భవన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ ఈ రోజు మరాఠీలో మాట్లాడాలా? లేక ఇంగ్లీష్‌లో మాట్లాడాలా? అని ఆలోచిస్తున్నాను. ఈ డైలామా చాలా చోట్ల కనిపిస్తుంటుంది. హైకోర్టు నిర్వహణ కార్యక్రమాల్లోనూ ఏ భాష వినియోగించాలన్న సంశయాలను చూశాను. హైకోర్టుల్లో అధికారిక భాషగా నేడు ఇంగ్లీష్, హిందీ ఉన్నాయి. అయినా కొందరు తమకు తమిళం కావాలని, మరికొందరు తెలుగు కావాలని అడుగుతుంటారు. దీనిపై జరగాల్సినంత చర్చ జరగలేదని భావిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ కూడా ఈ సమస్యను ముందుగానే గుర్తించి ఓ ప్రతిపాదన చేశారు.

దేశవ్యాప్తంగా సంస్కృతం అధికారిక భాషగా ఉండాలని ఓ ప్రతిపాదన తయారు చేశారు. దక్షిణంలో హిందీ, ఉత్తరాదిన తమిళాన్ని ఆమోదించరు. కానీ, సంస్కృతానికి దేశమంతటా ఆదరణ ఉంటుంది. అందుకే అంబేద్కర్ ఆ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనను ఆయన చర్చకు పెట్టారా? లేదా? అనేది తెలియదు. కానీ, దానిపై అంబేద్కర్ సహా ముల్లాలు, పండితులు, పురోహితుల సంతకాలున్నాయి. అంబేద్కర్‌కు పేద ప్రజలకు ఏం అవసరమో అది తెలుసు. అందుకే ఈ ప్రతిపాదన చేసి ఉండొచ్చు. కానీ, చివరకు ఆంగ్లాన్ని అధికారిక భాషగా చేశారు. కాబట్టి నేడు నేను ఇంగ్లీష్‌లోనే ప్రసంగిస్తున్నా’ అని అంబేద్కర్ జయంతి రోజున అన్నారు.

Advertisement

Next Story

Most Viewed