ప్రజల మధ్య ప్రజాప్రతినిధులు

by Shyam |
ప్రజల మధ్య ప్రజాప్రతినిధులు
X

దిశ, మహబూబ్ నగర్: అనుకున్నది అనుకున్నట్టుగా అక్కడ అమలవుతోంది. ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శిస్తలేరు. ఎప్పుడూ అలర్ట్ గా ఉంటూ అందరినీ యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ఎలాగైనా దానిని తరిమికొట్టే పనిలో వారందరూ కూడా తలమునకలైతున్నారు. దీంతో వాళ్లంతా ఇతరులకు ఆదర్శమయ్యారు. అదేమిటో మీరే చూడండి.

కరోనా నివారణ కోసం అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను స్థానిక నాయకులు పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సర్పంచులు చొరవ తీసుకుని గ్రామాల్లో కరోనా నివారణ చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. పట్టణాల్లో మున్సిపల్ అధికారులకు తోడుగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు సిబందితో కలిసి వార్డుల్లో వైరస్ నివారణ మందును పిచికారీ చేయిస్తున్నారు. అలాగే షాపుల వద్ద, మార్కెట్ల వద్ద కూడా ప్రజలు గుంపులుగా ఉండకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా కొత్తవారు వార్డులోకి, గ్రామాల్లోకి వచ్చారా అనే విషయాలను ఆరా తీస్తూ వైద్య సిబందికి సమాచారం ఇస్తున్నారు. రోడ్లపైకి వచ్చే ప్రజలను కూడా వారు వారిస్తున్నారు. అలాగే, గ్రామాలో ప్రజలకు కరోనాపై పూర్తి అవగాహన కలిపిస్తున్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.

దారులు మూసివేత

పట్టణ కేంద్రాల్లో దాదాపు అన్ని వీధులకు వెళ్లే దారులను మూసివేశారు. ప్రజల రాకపోకలను నియంత్రణ కోసం పోలీసులు ఎక్కడికక్కడ ప్రధాన ద్వారాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని ఎవరైనా తొలగించే ప్రయత్నం చేసినా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా వారిపై కఠిన చర్యలతోపాటు జరిమానాలు విధించడం జరుగుతుందని పేర్కొంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ప్రజలు కూరగాయల కోసం గుంపులుగా రైతుబజార్లకు వస్తున్న నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక కూరగాయల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరస్ కారణంగా ఆకలికి అలమటిస్తున్న అనాథలు, యాచకుల కోసం కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంమీద కరోనా నియంత్రణ కోసం ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు.

Tags : Mahabubnagar, Official, Public Representatives, Measures for Prevention of Corona, Villages and Towns


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed