టిక్‌టాక్‌ను కొనే ఆలోచన లేదు : సుందర్ పిచాయ్

by Shyam |   ( Updated:2020-08-27 09:11:53.0  )
టిక్‌టాక్‌ను కొనే ఆలోచన లేదు : సుందర్ పిచాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఆసక్తి లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఇటీవల టిక్‌టాక్ కొనడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్ అమెరికా కంపెనీలతో పాటు, భారత్‌లోని రిలయన్స్ సంస్థతో కూడా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుందర్ పిచాయ్ టిక్‌టాక్‌ను కొనే ఉద్దేశం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. వీడియో యాప్ టిక్‌టాక్‌ను కొనే ఉద్దేశ్యం లేదని చెప్పారు. అమెరికాలోని ఏ కంపెనీ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయకపోతే కంపెనీ కార్యకలాపాలను నిలిపేస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొంత గడువు ఇచ్చారు.

ప్రస్తుతం టిక్‌టాక్ యాప్ వారు.. గూగుల్ క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటున్నారని, దానికి అవసరమైన చార్జీలను కూడా చెల్లిస్తున్నారని సుందర్ పిచాయ్ వివరించారు. అలాగని, టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. మొదట గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ గ్రూప్ బిడ్ వేయాలని భావించినప్పటికీ తర్వాత విరమించుకున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story