రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గాయి : మంత్రి నిరంజన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-07-28 06:26:46.0  )
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : అతి తక్కువ రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ నమోదయిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ సమాధానమే దీనికి నిదర్శనమని చెప్పారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ రైతు వ్యవసాయ విధానాలు నిలిచాయని వివరించారు. వ్యవసాయ నిపుణుల సూచనలతోనే ఆరు నెలలపాటు మేధోమధనం చేసి రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు.

వ్యవసాయరంగం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రతి పౌరుడు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగాన్ని గత ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయని, తెలంగాణ ప్రభుత్వం దానికి పెద్దపీట వేసిందని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, సాగునీటి కల్పన, పంటల కొనుగోలుతో మద్దతుధర మూలంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయని వివరించారు.

2018 లో రైతుబంధు అమలు తర్వాత 2019లో 491కి రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని పార్లమెంటులో కేంద్రం ఈ సమాధానం చెప్పిందన్నారు. దీనికి ముఖ్యకారణం రైతుబంధు పథకం అమలు చేయడమని వివరించారు. సాగునీటి కల్పన, ఉచిత కరెంటుతో పాటు సాగు, దిగుబడి పెరగడం మార్కెట్‌లో మద్దతుధర దక్కడం రైతులు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేసిందన్నారు. గతంలో వ్యవసాయ సంక్షోభం మూలంగా ఇతర రంగాలకు మళ్ళిన వారు కూడా తిరిగి వ్యవసాయం వైపు దృష్టి సారించారని తెలిపారు. పెరిగిన పంటలు, పెరిగిన ఉపాధులతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చెందిందన్నారు.

కరోనా విపత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చెందగా గత ఏడాది తెలంగాణలో మాత్రం ప్రాథమిక రంగంలో 17 శాతం, వ్యవసాయ రంగంలో 20 శాతం అభివృద్ధి నమోదు చేయడం తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే సాధ్యమయిందని చెప్పారు. బ్యాంకుల ద్వారా రుణాలు దొరకని పరిస్థితి నుండి రుణాల కోసం బ్యాంకుకు వెళ్లని పరిస్థితి తెలంగాణలో నెలకొంటున్నదన్నారు. రైతుబంధుపై రాజకీయం చేసేవారు కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగం మాదిరిగానే భవిష్యత్ లో దళితబంధు పథకం ద్వారా దళితులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని చెప్పారు. రైతుబంధు మాదిరిగానే దళితబంధు పథకం విజయవంతమవుతుంది పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed