ఆ SI మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడు.. రక్షణ కల్పించండి

by Sumithra |
ఆ SI మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడు.. రక్షణ కల్పించండి
X

దిశ, కామారెడ్డి : అసలు కేసును పక్కదారి పట్టించిన ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు తమను ఆ అధికారి బెదిరిస్తున్నాడని, ఆయన నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఓ కుటుంబం మీడియాను ఆశ్రయించింది. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్ బీ గెస్ట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబ సభ్యురాలు నాగుల నవత మాట్లాడుతూ.. తమది దోమకొండ గ్రామం అని, తన భర్త నాగోళ్ల సురేష్ ప్రతిరోజు మాదిరిగానే గత నెల నాల్గవ తేదీన ఆటో తీసుకుని ఇంటికి వస్తుండగా కొందరు రోడ్డుపై ఆపి అకారణంగా దాడి చేశారన్నారు. విషయం తెలిసి తాను వెళ్లగా తనపై కూడా దాడి చేశారని వివరించింది.ఈ విషయమై పోలీసు స్టేషన్‌కు వెళ్లగా ఆస్పత్రి నుంచి రసీదు తేవాలని సూచించారని, తాము హాస్పిటల్‌కు వెళ్లినట్లు తెలిపారు. జరిగిన విషయాన్ని తమ తమ్ముడు ఉపేంద్రకు ఫోన్ చేయగా, అతను 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని బాధితురాలు మీడియాకు వివరించింది.

100కి కాల్ చేసి ఫిర్యాదు చేసిన వాళ్ళను ఏం జరిగిందనేది విచారణ చేయకుండా దాడికి పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ తనను, తన భర్త, మేనమామ, తన తమ్ముడిని స్టేషన్‌కు పిలిపించారని వాపోయింది. తమపై దాడి చేసిన వాళ్ళను వదిలేసి వారిపైనే తాము దాడి చేసినట్టుగా ఫిర్యాదు తీసుకుని తమ తమ్ముడు ఉపేంద్ర, మామయ్య రాజుపై ఎస్సై రాజేశ్వర్ గౌడ్, కానిస్టేబుల్ మహేష్ ఇష్టారీతిన దాడి చేసి కొట్టారని తెలిపింది. ఫైబర్ లాఠీతో చేతులపై కొట్టడంతో రెండు వేళ్ళు ఫ్యాక్చర్ అయ్యాయని నవత వెల్లడించింది. ఇక్కడ న్యాయం జరగదని తెలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా బిక్కనూర్ సీఐను ఈ కేసును పరిశీలించాలని ఆదేశాలు వచ్చాయని తెలిపింది. అయినా, పోలీసులు తమ ఫిర్యాదుపై స్పందించడం లేదన్నారు. పైగా ఎస్సై, కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేసినందుకు తమకు ఫోన్ చేసి ఫిర్యాదు వాపసు తీసుకోవాలని వేధిస్తున్నారని, లేకపోతే మర్డర్ కేసులో ఇరికిస్తామని, ఎక్కడైనా దొరికితే వదిలిపెట్టమని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మీడియా ద్వారా బాధిత కుటుంబ సభ్యులు ఎస్పీని కోరారు.

Advertisement

Next Story