సరిహద్దుల్లో కఠిన చర్యలు.. ఏరియల్ సర్వే ద్వారా రాకపోకల గుర్తింపు

by Shyam |   ( Updated:2021-06-04 11:53:57.0  )
సరిహద్దుల్లో కఠిన చర్యలు.. ఏరియల్ సర్వే ద్వారా రాకపోకల గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ సరిహద్దులుగా ఉన్న జిల్లాలపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి కేటాయించింది. అత్యధికంగా నల్గొండ, ఖమ్మం, గద్వాల, నారాయణ పేట జిల్లాలో కేసులు నమోదవుతుండటంతో తగిన చర్యలు చేపట్టారు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు. ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టి వ్యాధిని కట్టడి చేసేందుకు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. టెస్ట్‌లు పెంచడం, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, వ్యాధి గ్రస్తులను గుర్తించడం వంటి కార్యక్రమాలు ముమ్మరం చేశారు. వైద్యాధికారులు చేపట్టిన కార్యక్రమాలపై ప్రభుత్వానికి మరో రెండు రోజుల్లో పూర్తి నివేధికను సమర్పించనున్నారు.

ఏపీ సరిహద్దు జిల్లాల్లో పర్యటన

రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న నల్గొండ, ఖమ్మం, గద్వాల, నారాయణ పేట జిల్లాలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పర్యటనలు చేపట్టారు, మొదటగా నల్గొండ జిల్లా హలియాలో రోడ్డు మార్గం ద్వార పర్యటనలు చేపట్టిన అధికారులు కోదాడ, సూర్యపేటలో, ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్, నారాయణపేట జిల్లాలోని మక్తల్ ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా పర్యటనలు చేపట్టారు. రోడ్డు మార్గం ద్వారా సరిహద్దు ప్రాంతాలను గుర్తించడంలో సమస్యలు ఎదురవడంతో అధికారులు ఏరియల్ సర్వే చేపట్టి సరిహద్దు ప్రాంతాలను గుర్తించారు. ఏపి నుంచి ఏ ఏ రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలోకి రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయనే అంశాలను నమోదు చేసుకొని తగిన చర్యలు చేపట్టారు.

వ్యాధి తీవ్రత ప్రాంతాల గుర్తింపు

అత్యధికంగా రాకపోకలు జరుగుతున్న ప్రాంతాల్లో వ్యాధి తీవ్రతను అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో వ్యాధిని కట్టడి చేసేందుకు తగిన చర్యలను చేపట్టారు. సరిహద్దుల్లోని అన్ని మండల కేంద్రాల పరిధిలో రోజుకు తప్పనిసరిగా 300 టెస్టులను నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టారు. గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి ఆశావర్కర్ల సాయంతో ఇంటింటికి తిరిగి వ్యాధి అనుమానితులను గుర్తించి టెస్ట్‌లు చేపడుతున్నారు. వ్యాధితీవ్రత పెరగక ముందే సరిపడా మందులను అందించి ఆసుపత్రి వరకు పేషెంట్లు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మండల కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటర్లు

సరిహద్దుల్లోని ప్రతి మండల కేంద్రాల్లో అన్ని వైద్య సదుపాయాలతో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్లయించారు. ఇందు కోసం పాఠశాల భవనాలు, ఫంక్షన్‌హాళ్లను, కమ్యూనిటీ భవనాలను ఎంపిక చేస్తున్నారు. వ్యాధి భారిన పడి ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఇతరులకు వ్యాధిసోకుండా ముందుస్తుగా జాగ్రత్తలు చేపడుతున్నారు. టెస్టింగ్, ట్రెసింగ్, ట్రీట్ మెంట్ విధానాలను వేగవంతం చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలను, వైద్య సిబ్బందిని, పారిశుధ్య సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు చర్యలను యద్ధ ప్రాతిపాధిక చేపట్టి వ్యాధివ్యాప్తిని అదుపులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్లలో, మండల స్థాయి కమ్యూనిటీ హెల్త్ కేర్ ఆసుపత్రులను కోవిడ్ చికిత్సలను 24గంటల పాటు అందించేలా చర్యలు చేపట్టారు.

జనాల రద్ధీలు తగ్గించేలా చర్యలు

మండల కేంద్రాల్లోని రోడ్లపై జనలా రద్ధీని గుర్తించి అధికారులు తగని చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. సంతలు జరగకుండా రోడ్లపై ఎక్కవ మంది గుమికూడకుండా ఉండేలా కఠిన ఆంక్షలు చేపట్టారు. పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు ఆంక్షలు అమలు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. 40 నుంచి 50 మందికి మాత్రమే పెళ్లిళ్లకు అనుమతించేలా చర్యలు చేపట్టారు.

ప్రభుత్వానికి నివేదికలు

సరిహద్దుల్లోని నాలుగు ప్రాంతాల్లోన పర్యటనలు చేపట్టిన ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డా గంగాధర్ లు మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేధికలు సరమర్పించనున్నారు. వ్యాధివ్యాప్తి కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలను వివరించనున్నారు.

Advertisement

Next Story