ఏపీకి ఆ దేశమే ఆదర్శమా.. లేక మరింత కుప్పకూలుతుందా?

by srinivas |
ఏపీకి ఆ దేశమే ఆదర్శమా.. లేక మరింత కుప్పకూలుతుందా?
X

వైద్య ఆరోగ్య రంగంలో రాష్ర్ట ప్రభుత్వం వేస్తున్న అడుగులు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో రూ.8 వేల కోట్ల వ్యయంతో 16 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాటికి అనుసంధానంగా నర్సింగ్​కళాశాలలు, బోధనాస్పత్రులు వస్తాయి. గ్రామీణ ప్రాంతంలో విలేజ్​క్లినిక్స్​ఏర్పాటు చేస్తోంది. ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టరు సేవలందించడమే లక్ష్యమని చెబుతోంది. మరోవైపు నగరాల్లో ఆరోగ్య కూడళ్లు ఏర్పాటు చేయాలంటోంది. వందకోట్ల పెట్టుబడితో ఆస్పత్రులు పెట్టే కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరుస్తోంది. చవకగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రభుత్వం ద్వారా తీర్చి దిద్ది అందిస్తామంటోంది. ఈపాటికే ఆరోగ్యశ్రీ ద్వారా రెండేళ్లలో రూ.5 వేల కోట్లకు పైగా కార్పొరేట్​ఆస్పత్రులకు ప్రజల సొమ్ము ధారపోశారు. ఇంతకీ వైద్యరంగాన్ని మరింతగా కార్పొరేట్​శక్తులకే పూర్తిగా అప్పగించాలనుకుంటుందా లేక వాటిని బయటకు నెట్టేసి ప్రభుత్వరంగంలో కొనసాగిస్తూ మరో క్యూబా అవ్వాలనుకుంటుందా.!

ఏపీ బ్యూరో: కోవిడ్​వైరస్​కట్టడిలో ప్రపంచానికే వైద్యులను అందిస్తోంది అతి చిన్న దేశమైన క్యూబా. ప్రతీ వెయ్యిమంది ప్రజలకు ఓ వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తోంది. క్యూబాలో ప్రతీ వెయ్యి మందికి 9 మంది వైద్యులున్నారు. అక్కడ ఎవరికైనా వైద్యం ఉచితమే. అలాంటి గొప్ప దేశాన్ని ఏపీ ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ర్టాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లేట్లు సీఎం జగన్​అడుగులు పడాలి. ఇది రాష్ర్ట ప్రజల ఆకాంక్ష. కరోనాలాంటి విపత్కర సమయంలో మన వైద్య వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ఇలాంటి తరుణంలో సీఎం జగన్​రానున్న మూడేళ్లలో 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. ఆవశ్యం. వీటికితోడు నర్సింగ్​కళాశాలలు నెలకొల్పడం విశేషం.

నేడు దేశంలో 52 శాతం మంది వైద్యులు కేవలం 5 రాష్ర్టాల్లోనే సేవలందిస్తున్నారు. అందులో ఏపీ ఒకటిగా ఉంది. 2019 నాటికి దేశంలో ప్రతీ 1404 మందికి ఓ డాక్టరు చొప్పున ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సుమారు 8 లక్షల మందిగా ఉన్న ఆయుష్​ వైద్యులతో కలుపుకుంటే ఇది ప్రతీ 848 మందికి ఓ డాక్టరు చొప్పున సేవలందిస్తున్నట్లు లెక్క. సుమారు 30 లక్షల మంది నర్సులు, మరో 57 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు వైద్య సేవలందిస్తున్నారు. అదే రాష్ర్టంలో ప్రతీ 689 మందికి ఓ వైద్యుడు సేవలందిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వైద్యులే ఏపీ కింద నమోదై ఉన్నారు. వీళ్లను తెలంగాణ కింద చూపితే ఈ నిష్పత్తి ఇంకా పెరిగే అవకాశముంది. వాస్తవానికి వైద్యమంతా ఎక్కువ భాగం ప్రైవేటు రంగంలో ఉండడంతో మూడొంతుల మంది వైద్యులు, ఆస్పత్రులు అర్బన్​ప్రాంతాలకే పరిమితయ్యాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల్లేవు.

ప్రస్తుతం రాష్ర్టంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. ఇవిగాక మరో 15 ప్రైవేటు కళాశాలలు వైద్య విద్యను అందిస్తున్నాయి. వీటి ద్వారా సుమారు 1900 మంది వైద్యులు ఏటా బయటకు వస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. పరిశోధనలకు తగినంత ప్రోత్సాహం లేదు. ఇక ప్రైవేటు కళాశాలలు కేవలం సర్టిఫికెట్లు ఇవ్వడానికేనన్నట్లున్నాయి. నాణ్యమైన విద్యా ప్రమాణాల్లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన వైద్యులు తయారు కావడం లేదనే ఆరోపణలున్నాయి. దీన్ని అధిగమించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ రంగంలో 16 వైద్య కళాశాలలను రూ.8 వేల కోట్ల వ్యయంతో నిర్మించడానికి సిద్ధమైంది. వీటికి అనుసంధానంగా నర్సింగ్​కళాశాలలు, బోధనాస్పత్రులు వస్తాయి. రాష్ర్ట రూపురేఖలే మారనున్నాయి.

అదే సమయంలో ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలల్లో ప్రమాణాలు పెంచాలి. అత్యుత్తమమైన ఫ్యాకల్టీని అందించాలి. ప్రభుత్వ బోధనాస్పత్రులు, కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన మెరుగైన వేతనాలతో సిబ్బందిని నియమించాలి. ప్రస్తుతం బోధనాస్పత్రుల్లోనే మూడింట రెండొంతులు కేవలం నామ్​కేవాస్తే వేతనాలతో అవుట్​సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీళ్లకు నెలల తరబడి వేతనాలు పెండింగులో ఉంటున్నాయి. ఆస్పత్రులకు వచ్చిన రోగులపై ఆధారపడి కుటుంబాలు నెట్టుకొస్తున్నారు. శాశ్వత ఉద్యోగాల్లో ఉన్న సిబ్బంది అసలు పనిచేయరు. సీనియర్​వైద్యులు నాడి పట్టే స్థితి లేదు. ఎక్కువ సమయం బయట ప్రాక్టీసులోనే ఉంటున్నారు. ఆస్పత్రి సిబ్బంది పనిలో పారదర్శకత లేదు. జవాబుదారీతనం అంతకన్నా లేదు. ఇటీవల తిరుపతి రుయా సర్వజనాస్పత్రిలో 23 మంది కోవిడ్ బాధితులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం బోధనాస్పత్రుల పనితీరుకు నిదర్శనం.

ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కార్పొరేట్​రంగంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. నగరాల్లో వైద్య కూడళ్లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. వంద కోట్ల పెట్టుబడితో ఆస్పత్రి ఏర్పాటు చేసే బడాబాబులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై అనేక అపోహలకు బీజం వేస్తోంది. ప్రజల సొమ్ముతో వైద్యుడ్ని చేసి కార్పొరేట్​ఆస్పత్రుల్లో వెట్టి చాకిరీకి పంపినట్లవుతుంది. కార్పొరేట్​వైద్యం అందించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. ఓవైపు వైద్య విద్యకు నిధులు వెచ్చిస్తూ ఆ ఫలాలను కార్పొరేట్​ఆస్పత్రులకు అప్పగించడం ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రభుత్వం ఈపాటికే విలేజ్​క్లినిక్స్​ఏర్పాటు చేస్తోంది. ఫ్యామిలీ డాక్టరు స్థాయిలో ప్రజలకు సేవలందించాలంటే ప్రతీ క్లినిక్‌లోనూ డాక్టరు ఉండాలి. అప్పుడే ప్రభుత్వం చెబుతున్న లక్ష్యాన్ని చేరుకోగలదు. ఇకనైనా ప్రభుత్వం ఈ గందరగోళానికి తెరదించాలి. కార్పొరేట్​శక్తులకే వైద్యాన్ని పూర్తిగా అప్పగిస్తుందా లేక ప్రభుత్వ రంగంలో బలోపేతం చేసి కార్పొరేట్లను తరిమేస్తుందా అనేది స్పష్టం చేయాలి.

Advertisement

Next Story