లాక్ డౌన్ పొడిగింపేనా?

by Shamantha N |
లాక్ డౌన్ పొడిగింపేనా?
X

దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ అమలులోకి వచ్చి రెండు వారాలు ముగిసిన నేపథ్యంలో ఈ నెల 14న దాన్ని ఎత్తి వేస్తారా? పొడిగిస్తారా? అనే అంశంపై చర్చ జరుగుతున్నది. అందరి దృష్టి 14వ తేదీ పైనే ఉన్నది. కేంద్రం లాక్ డౌన్ పొడిగింపుపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తగిన సమయంలో దానిపై స్పందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ, లాక్ డౌన్ పొడిగించే యోచనలో ఉన్నట్లు ఇదివరకే.. తెలంగాణ తెలుపగా.. మహారాష్ట్ర, రాజస్తాన్, యూపీ, అస్సాం, ఛత్తీస్ గడ్, జార్ఖండ్ లు 14వ తేదీ తర్వాత లాక్ డౌన్ లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయబోమన్న సంకేతాలనిచ్చాయి. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఆలోచిస్తున్నట్టు కొన్ని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

లాక్ డౌన్ పొడిగింపుపై రాష్ట్రాలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని 11 మంది సభ్యులతో ప్రధాని మోడీ.. ఉన్నత స్థాయి సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అందుకున్న సలహాల్లో లాక్ డౌన్ పొడిగించాలన్నవే ఎక్కువ ఉన్నట్టు సమాచారం. పలు రాష్ట్రాలు సహా నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం అందింది. అన్ని మతాల కార్యక్రమాలను రద్దు చేయాలని, పాఠశాలలు, కాలేజీలు జూన్ వరకు మూసే ఉంచాలని ఆ కమిటీకి సూచనలు అందినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను, పోస్టింగ్ లను ఆరు నెలలపాటు వాయిదా వేయాలని, హోటళ్లు.. రెస్టారెంట్లు.. బార్లు మూసి ఉంచాలన్న అభ్యర్థనలు వచ్చాయని తెలిసింది. పెండ్లిళ్లు, వేడుకలు, అంతిమ సంస్కారాలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలుండాలని రాష్ట్రాలు కోరినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలది అదే మాట:

లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించాలని తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఆర్థికం కంటే.. ముందు.. ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన తెలిపారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేస్తే.. ఇన్నాళ్లు తీసుకున్న జాగ్రత్తలు వృధా అవుతాయని పేర్కొన్నారు. లాక్ డౌన్ పొడిగించాలనే కేంద్రాన్ని అభ్యర్థించనున్నట్టు ఆయన సోమవారం చెప్పారు. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలూ అదే మాట ఎత్తుకున్నాయి.

ఉత్తర ప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనిష్ అవస్థీ ఇదే వైఖరిని వెల్లడించారు. రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు లేదని స్పష్టమయ్యాకే లాక్ డౌన్ ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క కరోనా బాధితుడున్న లాక్ డౌన్ ఎత్తివేయడం కష్టమే. అందుకే లాక్ డౌన్ ఎత్తివేతకు సమయం పడుతుందని తెలిపారు.

అస్సాం ఆర్థిక మంత్రి హేమంత బిశ్వ శర్మ లాక్ డౌన్ పై స్పందిస్తూ.. ఏప్రిల్ 15న అన్ని ఓపెన్ కావాలని భావించడం లేదన్నారు. లాక్ డౌన్ ఉపసంహరణ ఏ పద్ధతిలో జరగాలో రాష్ట్రంలోనే పలువురితో సంప్రదింపులు జరిపామని తెలిపారు. అది ఒక క్రమపద్ధతి జరగాలని చెబుతూ.. ఇన్నాళ్లు తీసుకున్న చర్యలను ఒక్కరోజులోనే నిరర్ధకం కారాదని అన్నారు.

రెడ్ అలర్ట్ మరియు జోన్లు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కనీసం మరో రెండు వారాల పాటు లేదా నెల చివరి వరకు కొనసాగించాలని కేంద్రాన్ని కోరబోతున్నట్టు కర్ణాటక మంత్రి సుధాకర్ కె తెలిపారు. కాగా, చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కోరినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అభ్యర్థనలను కేంద్రం పరిగణించబోతున్నట్టూ పేర్కొన్నాయి.

Tags: Coronavirus, lockdown, extension, centre, considering, states, suggestions

Advertisement

Next Story

Most Viewed