రోహిత్ నుంచి ఎంతో నేర్చుకున్నా : సూర్యకుమార్

by Harish |
రోహిత్ నుంచి ఎంతో నేర్చుకున్నా : సూర్యకుమార్
X

దిశ, స్పోర్ట్స్ : భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ శైలి నుంచి తానెంతో నేర్చుకున్నానని టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య పలు విషయాలపై స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా అతను ఎప్పుడూ ఒకేలా ఉంటాడని తెలిపాడు.

‘రోహిత్ భయ్యా నుంచి చాలా నేర్చుకున్నా. మైదానంలో అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. ఒత్తిడిని ఎలా అధిగమిస్తున్నాడు. ప్రశాంతంగా ఎలా ఉంటాడు. బౌలర్లతో ఎలా మాట్లాడతాడని గమనించేవాడిని. ఆటగాళ్లకు సమయాన్ని వెచ్చిస్తాడు. నేను కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నా. నేను మైదానంలో లేకపోతే ప్లేయర్లతో సమయం గడిపేందుకు చూస్తా. వాళ్లతో డిన్నర్‌కు వెళ్తా. ప్రయాణాలు చేస్తా. సహచరుడి గౌరవం పొందాలంటే ఇవి చాలా ముఖ్యం.’ అని తెలిపాడు.

కెప్టెన్‌గా తన బ్యాటింగ్ శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుందని, కెప్టెన్‌గా దూకుడుగా ఉండలేనని చెప్పాడు. ప్లేయర్లు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలని, వాళ్లకు స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యమన్నాడు. తన టెస్టుల్లోకి పునరాగమనంపై స్పందిస్తూ.. దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. జరగాల్సిన రోజు జరుగుతుందని తెలిపాడు. అలాగే, జాతీయ జట్టులో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ చోటుపై మాట్లాడుతూ.. ‘రుతురాజ్ అద్భుతమైన ప్లేయర్. అన్ని ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్నాడు. కానీ, అతని కంటే ముందు ఉన్న వారు కూడా ఉన్నారు. కాబట్టి, మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌ను ఫాలో అవ్వాల్సిందే. అతనికి త్వరలోనే జాతీయ జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed