రిటైర్మెంట్ ఆలోచన లేదు : Saina Nehwal

by Vinod kumar |   ( Updated:2023-09-13 14:19:31.0  )
రిటైర్మెంట్ ఆలోచన లేదు : Saina Nehwal
X

గురుగ్రామ్: తనకు ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని, తిరిగి ఆడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తెలిపింది. కొంతకాలంగా సైనా ఫామ్ లేమితో సతమతమవుతున్నది. మరోవైపు, మోకాలి గాయంతో బాధపడుతోంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్‌లో ఆమె చివరిసారిగా ఆడింది. గురుగ్రామ్‌లో బుధవారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గాయం, సన్నద్ధతపై ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

‘గంట, రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తేనే నా మోకాలు వాపు వస్తోంది. ప్రస్తుతం నేను మోకాలిని వంచలేకపోతున్నా. రెండో ట్రైనింగ్ సెషన్ ఇప్పట్లో ఉండకపోవచ్చు. పారిస్ ఒలింపిక్స్ సమయం దగ్గరపడుతున్నది. అయితే, అర్హత సాధించడం చాలా కష్టం. కానీ, నేను తిరిగి ఆడేందుకు శాయశక్తులా ప్రయ్నతిస్తున్నా. ఫిజియో సహాయం చేస్తున్నారు. కానీ, వాపు తగ్గకపోతే మాత్రం రికవరీకి సమయం పట్టొచ్చు. ఈ సమయంలో నేను ఆడలేను. ఫలితాలు కూడా రావు. ఉన్నత స్థాయి ప్లేయర్లతో ఆడాలంటే కేవలం గంట ట్రైనింగ్‌తో ఏం జరగదు.

మనం కూడా ఉన్నత స్థాయి ఆటను కలిగి ఉండాలి. మొదట నేను సమస్యను అధిగమించాలనుకుంటున్నా. శరీరాన్ని కాపాడుకోవడం, ఎలాంటి గాయాలు లేకుండా చూసుకోవడం ముఖ్యం.’ అని సైనా తెలిపింది. అలాగే, రిటైర్మెంట్‌ ఎదురైన ప్రశ్నకు సైనా స్పందిస్తూ..‘శరీరం సపోర్ట్ చేయడం లేదని తెలుసుకున్న రోజు ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ తీసుకుంటారు. ప్రస్తుతానికి నేను తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నా. నేను ఆటను ప్రేమిస్తున్నా.

ఇంకా చాలా కాలం ఆడాలనుకుంటున్నా. అందుకే, ప్రయత్నించడం ఒక స్పోర్ట్స్ పర్సన్‌గా బాధ్యత.’ అని చెప్పింది. అలాగే, కోచింగ్‌పై తన ఇంట్రెస్ట్ లేదని, ఆడటం సులభమని, కోచింగ్ కష్టమైన పని అని చెప్పుకొచ్చింది. ఆసియా గేమ్స్‌లో పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ రాణిస్తారని దీమా వ్యక్తం చేసింది. కాగా, గాయం కారణంగా సైనా నెహ్వాల్ ఆసియా గేమ్స్‌కు దూరంగా ఉంది. మరోవైపు, కొంతకాలంగా ఫామ్‌లేమి ఇబ్బంది పడుతున్న ఆమె.. ఈ ఏడాది ఆడిన ఆరు టోర్నీల్లో మొదటి, రెండో రౌండ్లలోనే నిష్ర్కమించింది. చివరిసారిగా 2019 జనవరిలో ఆమె ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ సాధించింది.

Advertisement

Next Story

Most Viewed