రెండు రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ.. వక్ర బుద్ది చూపెట్టుకున్న పాకిస్తాన్.. మండిపడుతున్న అభిమానులు

by Harish |
రెండు రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ.. వక్ర బుద్ది చూపెట్టుకున్న పాకిస్తాన్.. మండిపడుతున్న అభిమానులు
X

దిశ, స్పోర్ట్స్ : మరో రెండు రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభకానుండగా ఆతిథ్య పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. పాక్ స్టేడియాల్లో భారత్ జెండాను ఎగరవేయలేదు. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే అన్ని దేశాల జెండాలను మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో ఎగరవేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆ ఆనవాయితీని తుంగలో తొక్కి వివాదానికి తెరలేపింది.

చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికల్లో జరగనున్నాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్‌లోని గడాఫీ స్టేడియాల్లో పర్యాటక దేశాల జెండాలను ప్రదర్శించింది. అందులో భారత్ జెండా లేకపోవడం గమనార్హం. మిగతా ఏడు దేశాల జాతీయ జెండాలు కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్ని దేశాల జెండాలు ప్రదర్శించాల్సిన చోట త్రివర్ణ పతకం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీసీబీపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో పీసీబీ వర్గాలు స్పందించాయి. పాకిస్తాన్‌లో ఆడుతున్న దేశాల జెండాలు మాత్రమే ప్రదర్శించినట్టు తెలిపాయి. ‘చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా పాక్‌ రావడం లేదని అందరికీ తెలుసు. కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాల్లో ఆడే దేశాల జెండాలను మాత్రమే ఎగరవేశాం.’అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. తాజా ఘటనపై పీసీబీ అధికారికంగా స్పందించలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టీమిండియా పాక్‌కు వెళ్లడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తుండగా.. భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి

Next Story