ఆ విషయం కోహ్లీకే ముందు చెప్పాను : సునీల్ ఛెత్రి

by Harish |
ఆ విషయం కోహ్లీకే ముందు చెప్పాను : సునీల్ ఛెత్రి
X

దిశ, స్పోర్ట్స్ : భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి 19 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు గురువారం వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శుక్రవారం నిర్వహించిన వర్చువల్‌ ఇంటరాక్షన్‌లో ఛెత్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జూన్ 6న రిటైర్ అయిన తర్వాత జూన్ 7న చాలా సేపు ఏడుస్తానని చెప్పాడు. జూన్ 8న విశ్రాంతి తీసుకుంటానని, ఆ తర్వాత కుటుంబంతో గడుపుతానని తెలిపాడు. ‘రిటైర్మెంట్ నిర్ణయం ఫిజికల్ అంశం కాదు. మానసిక కోణంలో తీసుకున్నది. సులభంగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. నాతో నేనే పోరాడాను. కానీ, నా నిర్ణయంతో ప్రశాంతంగా ఉన్నా. నేను కలల కన్న దాని కంటే ఎక్కువే సాధించాను.’ అని తెలిపాడు.

రిటైర్మెంట్ గురించి ముందుగా విరాట్ కోహ్లీకి చెప్పానని, అతను తనను అర్థం చేసుకున్నాడని చెప్పాడు. వారసత్వం గురించి మాట్లాడుతూ..‘దాన్ని నేను పట్టించుకోవడం లేదు. ప్రజలు నన్ను కష్టపడే ఆటగాడిగా గుర్తుంచుకుంటే చాలు. నేను వదిలివెళ్లేది కూడా అదే.’ అని చెప్పాడు. అలాగే, భవిష్యత్తు కార్యాచరణ గురించి స్పందిస్తూ.. ‘ఒక ఏడాది బెంగళూరు ఎఫ్‌సీకి ఆడతాను. ఆ తర్వాత ఇంకెంత కాలం ఆడతానో తెలియదు. అనంతరం విశ్రాంతి తీసుకుంటాను. కోచ్‌గా మారనని చెప్పను. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా వచ్చే నెల 6న కువైట్‌తో అతను చివరి మ్యాచ్ ఆడనున్నాడు.

Advertisement

Next Story