- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లపై వేటుకు రంగం సిద్ధం.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఔట్?
దిశ, స్పోర్ట్స్ : జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే, టీమ్ ఇండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ కోసమే వారు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యర్, ఇషాన్ కిషన్‌లపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిపై వేటు వేసేందుకు బోర్డు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. సెంట్రాల్ కాంట్రాక్ట్ నుంచి వీరిని తొలగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సౌతాఫ్రికా పర్యటన నుంచి వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీ ఆడాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలతోపాటు బీసీసీఐ ఆదేశాలను అతను పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ఇషాన్ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్న వీడియోలు బయటకు రావడం మరింత చర్చకు దారితీసింది. మరోవైపు, ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులు ఆడిన శ్రేయస్ అయ్యర్‌ను మిగతా సిరీస్‌కు సెలెక్టర్లు పక్కనపెట్టారు. వెన్ను నొప్పి కారణంగా అతను దూరంగా ఉన్నాడని వార్తలు వచ్చినా..తొలి రెండు టెస్టుల్లో అతని వైఫల్యమే వేటు వేయడానికి కారణమని తెలుస్తోంది. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరిన అయ్యర్.. వెన్ను నొప్పి కారణంగా రంజీ ట్రోఫీకి అందుబాటులో ఉండలేనని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేసినట్టు తెలిసింది. అయితే, అయ్యర్ పూర్తిగా ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, రెండో టెస్టు తర్వాత అతను కొత్తగా గాయాల బారిన పడలేదని సెలెక్టర్లకు ఇటీవల ఎన్‌సీఏ మెయిల్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉండకపోవడంపై అయ్యర్, ఇషాన్‌లు చెప్పిన కారణంపై బీసీసీఐ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని బోర్డు చూస్తున్నట్టు సమాచారం. 2023 సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ బిలో ఉన్న అయ్యర్ రూ. 3 కోట్ల వార్షిక వేతనం పొందుతుండగా.. గ్రేడ్ సీలో ఉన్న ఇషాన్ కిషన్ రూ. కోటి అందుకుంటున్నాడు. 2024కు సంబంధించిన కాంట్రాక్ట్‌ను బీసీసీఐ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ‘అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ 2023-24 సీజన్2కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను దాదాపుగా ఫైనల్ చేసింది. త్వరలోనే ప్రకటించనుంది. బీసీసీఐ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న అయ్యర్, ఇషాన్ కిషన్‌లను ఈ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.