సిరీస్ మనదే.. నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం

by Swamyn |
సిరీస్ మనదే.. నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం
X

విరాట్ కోహ్లీ, రహానే, పుజారా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో లేరు. కేఎల్ రాహుల్, బుమ్రా వంటి కీలక ప్లేయర్లు గాయం, ఇతర కారణాలతో సిరీస్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక, తుది జట్టులో నలుగురు మినహా మిగిలినవారంతా కుర్రాళ్లే.. అవతలివైపేమో బజ్‌బల్ వ్యూహంతో ఎలాంటి జట్టునైనా బెంబేలెత్తించగలిగే ప్రత్యర్థి. అందుకనుగుణంగానే తొలి మ్యాచ్‌ ఫలితం. ఇంకేముంది? ఇన్ని సవాళ్లను ఎదుర్కొని భారత్ నిలబడటం అసాధ్యం అనుకున్నారు చాలామంది. కానీ, ఆ అసాధ్యాన్ని మన యువ సంచలనాలు సుసాధ్యం చేశారు. సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా ప్రదర్శనపై నెలకొన్న అనుమాలను పటాపంచలు చేస్తూ.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. మరోసారి భారత్‌తో ‘బజ్‌బాల్’ అంటేనే ఇంగ్లాండ్ ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు.

దిశ, స్పోర్ట్స్: రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 40/0తో నాలుగో రోజైన సోమవారం ఆట ప్రారంభించిన భారత్.. ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకుంది. నాలుగో రోజే ఆటను ముగించింది. ఫలితంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(55), గిల్(52 నాటౌట్) అర్ధసెంచరీలతో మెరవగా, యశస్వి జైశ్వాల్ (37) ధ్రువ్ జురెల్(39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన 39(నాటౌట్) పరుగులతో సత్తాచాటిన యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిగిలిన నామమాత్రపు ఐదో టెస్టు వచ్చే నెల 7నుంచి హిమాచల్ ప్రదేశ్ వేదికగా జరగనుంది.

బషీర్ భయపెట్టినా..

భారత బౌలర్ల విజృంభణతో రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్.. టీమ్ ఇండియా ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఆదివారం మూడో సెషన్‌లోనే లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన టీమ్ ఇండియా.. ఆ రోజు ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం. ఈ తరుణంలో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు.. చెప్పుకోదగ్గ ఆరంభమే దక్కింది. ఓపెనర్లు రోహిత్, జైశ్వాల్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పెంచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోరు 84 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తన ఓవర్ నైట్ స్కోరుకు మరో 21 పరుగులు జోడించిన యశస్వి(37).. రూట్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు, అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న రోహిత్(55).. ఆ వెంటనే టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(0), జడేజా(4), సర్ఫరాజ్(0)లను ఇంగ్లాండ్ బౌలర్ షోయాబ్ బషీర్ వెంటవెంటనే అవుట్ చేసి.. భారత్‌ను భయపెట్టాడు. బషీర్ దెబ్బకు 36 పరుగుల వ్యవధిలోనే టీమ్ ఇండియా కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది. అప్పటికి భారత్ స్కోరు 120/5. విజయానికి మరో 72 పరుగులు అవసరం. అప్పటికే 5 వికెట్లు కోల్పోవడం వల్ల మిగిలిన 72 పరుగులే కొండంత లక్ష్యంగా కనిపించాయి. దీంతో భారత అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇంగ్లాండ్ జట్టులో ఆశలు చిగురించాయి.

నిలబడ్డ గిల్, జురెల్

120కే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ టీమ్ ఇండియాను వన్‌డౌన్‌లో వచ్చిన శుభమన్ గిల్, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కీపర్ ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు. వరుస వికెట్ల పతనాన్ని అడ్డుకుని క్రీజులో పాతుకుపోయారు. ప్రత్యర్థి బౌలర్ల దూకుడుకు కళ్లెం వేశారు. కీలకమైన పరిస్థితుల్లో మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ ఇంగ్లాండ్ ఆశలను నిర్వీర్యం చేశారు. భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలోనే శుభమన్ గిల్ 122 బంతుల్లో రెండు సిక్సుల సాయంతో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. చివరకు 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు, ధ్రువ్ జురెల్ సైతం 39(77బంతులు: 2x4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

స్కోరు బోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 353/10 (104.5 ఓవర్లు)

భారత్ తొలి ఇన్నింగ్స్: 307/10 (103.2 ఓవర్లు)

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 145/10 (53.5 ఓవర్లు)

టీమ్ ఇండియా: 192/5 (61ఓవర్లు)

రోహిత్ శర్మ (సి) ఫోక్స్ (బి) టామ్ హార్ట్‌లే 55, జైశ్వాల్ (సి) జేమ్స్ అండర్సన్ (బి) రూట్ 37, గిల్ 52 నాటౌట్; రజత్ పాటిదార్ (సి) ఓలి పోప్ (బి) షోయాబ్ బషీర్ 0, జడేజా (సి) బెయిర్ స్టో (బి) బషీర్ 4, సర్ఫరాజ్ ఖాన్ (సి) ఓలి పోప్ (బి) బషీర్ 0, ధ్రువ్ జురెల్ 39 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు-5

వికెట్ల పతనం: 84-1, 99-2, 100-3, 120-4, 120-5

బౌలింగ్: జో రూట్ (7-0-26-1), టామ్ హార్ట్‌లీ (25-2-70-1), బషీర్ (26-4-79-3), జేమ్స్ అండర్సన్ (3-1-12-0)

Advertisement

Next Story