మూడోదీ పోయే.. వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

by Swamyn |
మూడోదీ పోయే.. వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
X

దిశ, స్పోర్ట్స్ : ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు మూడో వన్డేలోనూ చేతులెత్తేసింది. మొదట బంతితో.. ఆ తర్వాత బ్యాటుతో తేలిపోయింది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో 190 పరగుల తేడాతో టీమ్ ఇండియాను ఆస్ట్రేలియా జట్టు ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసిస్ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఓపెనర్ లిచ్‌ఫీల్డ్(119) శతకానికి తోడు కెప్టెన్ హీలీ(82) సైతం సత్తాచాటడంతో ఆసిస్ భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భారత జట్టు 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఆసిస్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో టీమ్ ఇండియా బ్యాటర్లు మొదటి నుంచి తడబడ్డారు. స్మృతి మంధాన చేసిన 29 పరుగులే టాప్ స్కోరంటే భారత్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ యాస్తికా భాటియా(6), కెప్టెన్ హర్మన్‌ప్రీత్(3) దారుణంగా విఫలమయ్యారు. స్మృతి మంధాన(29), రిచా ఘోష్(19), జెమిమా రోడ్రిగ్స్(25) క్రీజులో నిలువలేకపోయారు. దాంతో భారత్ 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకుంది. ఆ తర్వాత కూడా భారత్‌ను ఆదుకునే వారు కరువయ్యారు. దీప్తి శర్మ(25 నాటౌట్) అజేయంగా నిలువగా.. అమన్‌జోత్ కౌర్(3), పూజ(14) నిరాశపరిచారు. ఆ తర్వాత శ్రేయాంక (2), రేణుక(0)లను సదర్లాండ్ వరుస బంతుల్లో అవుట్ చేయగా.. చివరి వికెట్‌గా మన్నత్ కశ్యప్(8)ను వారేహమ్ అవుట్ చేయడంతో భారత్ ఆట ముగిసింది. ఆసిస్ బౌలర్లలో వారేహమ్ 3 వికెట్లు తీయగా.. మేఘాన్ షుట్, అలానా కింగ్, సదర్లాండ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. గార్డ్‌నెర్‌కు ఒక వికెట్ దక్కింది. ఆసిస్ ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకుంది.

తేలిపోయిన భారత బౌలర్లు.. శతక్కొట్టిన లిచ్‌ఫీల్డ్

అంతకుముందు భారత బౌలర్లు తేలిపోవడంతో.. ఆసిస్ ఇన్నింగ్స్‌ను మొదటి నుంచే దూకుడుగా సాగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు లిచ్‌ఫీల్డ్, అలీస్సా హీలీ తొలి వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. భీకర ఫామ్‌లో ఉన్న లిచ్‌ఫీల్డ్(119) సెంచరీతో కదం తొక్కింది. మరోవైపు, కెప్టెన్ హీలీ(82) సైతం చెలరేగింది. ఇన్నింగ్స్ మొదలు దూకుడుగా ఆడిన ఈ జోడీ భారత బౌలర్లను బెంబేలెత్తించింది. అయితే, భారత్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఈ జోడీకి కలిసొచ్చింది. పూజ వేసిన 7వ ఓవర్‌లో తొలి బంతి హీలీ బ్యాటు ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ రిచా ఘోష్ చేతుల్లోకి వెళ్లింది. కానీ, ఆ బంతిని రిచా అందుకునే క్రమంలో నేలకు తాకడంతో హీలీ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడింది. 19వ ఓవర్‌లో లిచ్‌ఫీల్డ్ ఇచ్చిన క్యాచ్‌ను దీప్తి శర్మ అందుకోలేకపోయింది. అవుటయ్యే ప్రమాదాల నుంచి బయటపడిన లిచ్‌ఫీల్డ్, హీలీ ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. దాదాపు 29 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన ఈ జంట.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. సెంచరీ దిశగా వెళ్తున్న హీలీని పూజ అవుట్ చేయడంతో ఈ జోడీ దూకుడుకు బ్రేక్ పడింది. హీలీని అవుట్ చేయడంతో ఆలస్యంగా పుంజుకున్న భారత బౌలర్లు కాసేపు ఆసిస్‌ను నిలువరించారు. క్రీజులోకి వచ్చిన ఎల్లీస్ పెర్రీ(16)ని అమన్‌జోత్ కౌర్ అవుట్ చేయగా.. మూనీ(3), మెక్‌గ్రాత్(0)లను శ్రేయాంక ఒకే ఓవర్‌‌లో పెవిలియన్‌కు పంపింది. మరోవైపు, ధాటిగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసిన లిచ్‌ఫీల్డ్‌ ఇన్నింగ్స్‌కు దీప్తి శర్మ తెరదించింది. అయితే, గార్డ్‌నెర్(30), సదర్లాండ్(23), అలానా కింగ్(26 నాటౌట్), వారేహమ్(11 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా 338/7 స్కోరు చేసింది. భారత బౌలర్లలో శ్రేయాంక 3 వికెట్లు తీయగా.. అమన్‌జోత్ కౌర్ 2 వికెట్లు, పూజ, దీప్తి చెరో వికెట్ పడగొట్టారు.

స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్ : 338/7(50 ఓవర్లు)

లిచ్‌ఫీల్డ్(సి)హర్మన్‌ప్రీత్(బి)దీప్తి 119, హీలీ(బి)పూజ 82, ఎల్లీస్ పెర్రీ ఎల్బీడబ్ల్యూ(బి)అమన్‌జోత్ 16, మూనీ ఎల్బీడబ్ల్యూ(బి)శ్రేయాంక 3, మెక్‌గ్రాత్ ఎల్బీడబ్ల్యూ(బి)శ్రేయాంక 0, గార్డ్‌నెర్(బి)శ్రేయాంక 30, సదర్లాండ్(సి)హర్మన్‌ప్రీత్(బి)అమన్‌జోత్ 23, వారేహమ్ 11 నాటౌట్, అలానా కింగ్ 26 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 28.

వికెట్ల పతనం : 189-1, 209-2, 216-3, 216-4, 256-5, 295-6, 299-7

బౌలింగ్ : రేణుక(7-0-52-0), పూజ(10-0-68-1), శ్రేయాంక(10-0-57-3), మన్నత్ కశ్యప్(3-0-30-0), దీప్తి శర్మ(10-0-53-1), అమన్‌జోత్ కౌర్(10-0-70-2)

భారత్ మహిళల ఇన్నింగ్స్ : 148 ఆలౌట్(32.4 ఓవర్లు)

యాస్తికా భాటియా(బి)మేఘాన్ షుట్ 6, స్మృతి మంధాన(సి)కిమ్ గార్త్(బి)మేఘాన్ షుట్ 29, రిచా ఘోష్(బి)వారేహమ్ 19, హర్మన్‌ప్రీత్(సి)మూనీ(బి)వారేహమ్ 3, రోడ్రిగ్స్(సి)అలానా కింగ్(బి)గార్డ్‌నెర్ 25, దీప్తి శర్మ 25 నాటౌట్, అమన్‌జోత్(సి)లిచ్‌ఫీల్డ్(బి)అలానా కింగ్ 3, పూజ(బి)అలానా కింగ్ 14, శ్రేయాంక(సి)మెక్‌గ్రాత్(బి)సదర్లాండ్ 2, రేణుక(సి)హీలీ(బి)సదర్లాండ్ 0, మన్నత్ కశ్యప్(సి)మూనీ(బి)వారేహమ్ 8; ఎక్స్‌ట్రాలు 14.

వికెట్ల పతనం : 32-1, 43-2, 57-3, 72-4, 98-5, 102-6, 128-7, 135-8, 135-9, 148-10

బౌలింగ్ : మేఘాన్ షుట్(6-1-23-2), కిమ్ గార్త్(5-0-33-0), వారేహమ్(6.4-0-23-3), గార్డ్‌నెర్(7-0-38-1), అలానా కింగ్(5-0-21-2), సదర్లాండ్(3-0-9-2)

Advertisement

Next Story

Most Viewed