Paris olympics : ఒలింపిక్స్‌లో భారత్‌కు 4వ పతకం.. హాకీలో కంచు మోత

by Harish |
Paris olympics : ఒలింపిక్స్‌లో భారత్‌కు 4వ పతకం.. హాకీలో కంచు మోత
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో పతక నిరీక్షణకు తెరపడింది. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో స్పెయిన్‌ను 2-1తో ఓడించి పతకం కొల్లగొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో మొదటి గోల్ ప్రత్యర్థిదే. 18వ నిమిషంలో మార్క్ మిరల్లెస్ స్పెయిన్ తరపున తొలి గోల్ చేశాడు. అనంతరం భారత ఆటగాళ్లు దూకుడు పెంచారు. స్పెయిన్ దాడులను తిప్పికొట్టారు.

అదే సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతం చేశాడు. స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్ చేశాడు. 30వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. మరో మూడు నిమిషాల వ్యవధిలోనే హర్మన్‌ప్రీత్ 33వ నిమిషంలో మరో గోల్ చేయడంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు భారత్ లీడ్‌ను కాపాడుకుని కాంస్యం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ జట్టు కాంస్యమే నెగ్గిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది నాలుగోవ పతకం. షూటింగ్‌లో మూడు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed