10 గంటల్లో 4.6 కిలోలు తగ్గాడు.. రాత్రంతా కష్టపడిన అమన్

by Harish |
10 గంటల్లో 4.6 కిలోలు తగ్గాడు.. రాత్రంతా కష్టపడిన అమన్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ 50 కేజీల కేటగిరీలో 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. అమన్ సెహ్రావత్ కూడా అదనపు బరువు కారణంగా అనర్హత ముప్పును ఎదుర్కొనేవాడు. అసలేం జరిగిందంటే.. 57 కేజీల కేటగిరీలో పోటీపడిన అమన్ గురువారం రాత్రి జరిగిన సెమీస్‌లో ఓడిపోయాడు. దీంతో తర్వాతి రోజు శుక్రవారం బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అయితే, సెమీస్‌లో ఓటమి అనంతరం అమన్ బరువు చూడగా 61.5 కేజీలు ఉన్నాడు. రాత్రికి రాత్రి 57 కేజీలకు తగ్గేందుకు చాలా కష్టపడ్డాడు. అస్సలు నిద్ర పోలేదు. కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు.

వినేశ్ ఫొగట్ అనర్హత వేటు నేపథ్యంలో కోచ్‌లు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కోచ్‌లు వీరేంద్ర దహియా, జగమందర్ సింగ్ బృందం శ్రమించింది. గంటన్నరపాటు అమన్ మ్యాట్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత గంటపాటు అమన్ వేడి నీళ్ల స్నానం, అనంతరం అరగంట నాన్‌స్టాప్ ట్రేడ్ మిల్ సెషన్‌లో పాల్గొన్నాడు. అరగంట విరామం తర్వాత ఐదు నిమిషాలచొప్పున ఐదు సెషన్లపాటు ఆవిరి స్నానం చేశాడు. దీంతో అతను 3.6 కిలోలు తగ్గాడు. అయితే, అనర్హత వేటు నుంచి బయటపడేందుకు అతను ఇంకా బరువు తగ్గాల్సి ఉండగా.. కాసేపు జాగింగ్, 15 నిమిషాలపాటు రన్నింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. శుక్రవారం ఉదయం 4:30 గంటలకు బరువు కొలువగా అమన్ 56.9 కిలోలకు తగ్గాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story