రైతుబంధు.. ఎవరికి బంద్!

by Shyam |
రైతుబంధు.. ఎవరికి బంద్!
X

దిశ, మహబూబ్ నగర్:
వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం.. ప్రతి ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రారంభించిన సమయంలో పట్టా భూములున్న ప్రతి ఒక్కరికీ.. ఎన్ని ఎకరాలున్నా పెట్టుబడి సాయం అందించింది. ఎన్నికల తరువాత సీన్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి. రెండు దఫాలుగా పెట్టుబడి సాయం రైతులందరికీ అందకపోవడంతో పథకం అమలుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు. ముఖ్యంగా ఐదెకరాలు దాటినవారికి ఈ పథకం వర్తించదని కొన్ని వదంతులు ప్రచారంలో వున్నాయి. ఈ గందరగోళంపై అధికార పార్టీ నాయకులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, అధికారులు ఎవరూ సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. జిల్లాస్థాయి అధికారులను అడిగితే తాము రైతులందరి పేర్లను పంపామని, ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు పథకాన్ని వర్తింపచేస్తుందనే విషయంలో తమకు కూడా ఎలాంటి సమాచారం లేదని వారు అంటున్నారు. దీంతో జిల్లాలో చాలామంది రైతులు.. రైతుబంధు డబ్బులు అసలు వస్తాయా? రావా? అనే మీమాంసలో వున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 8.42 లక్షల మంది రైతులు వున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2018 ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లాలోని 8,20,303 మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రూ.957 కోట్లను పెట్టుబడి రూపంలో అందజేసింది. 2019లో మాత్రం ఉమ్మడి జిల్లా గణంకాల ప్రకారం 1,36,948 మంది రైతులకు ఇప్పటికీ పెట్టుబడి సాయం అందలేదు. ఇందుకు నిధుల కొరతే కారణమని కొందరు.. భూముల లెక్కల ఆధారంగానే ప్రభుత్వం రైతుబంధు అందజేస్తుందని మరికొందరు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం రైతుబంధుకు రాష్ట్రవ్యాప్తంగా రూ.14 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కానీ, కేవలం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనే ప్రతిఏటా రూ. 2,410 కోట్లు అవసరం వున్నట్టు అధికారుల అంచనా. బడ్జెట్‌లో కేటాయించిన నిధుల ప్రకారం చూస్తే ఈసారి కూడా రైతుబంధు ఎంతమేరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రస్తుత మహబూబ్‌నగర్‌లో 1,78,300 రైతు ఖాతాలు వుండగా వారికి రూ. 284 కోట్లు, నాగర్ కర్నూల్‌లో 2,48,486 మంది రైతులకు రూ.375 కోట్లు, వనపర్తి జిల్లాలో 1,42,029 మంది రైతులకు రూ.176 కోట్లు, జోగులాంబ గద్వాలలో 1,44,445 మంది రైతులకు రూ.213 కోట్లు, నారాయణపేటలో 1,28,905 మంది రైతులకు రూ.157 కోట్లు రైతుబంధుకు అవసరం వున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న నిధులకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. ప్రభుత్వం పెద్దలు స్పందిస్తేనే రైతుబంధు పథకంపై రైతులకు క్లారిటీ వచ్చే అవకాశముంది!

Tags : MBNR, Rythu Bandhu, Agriculture, farmers, Budget

Advertisement

Next Story