భగవత్ స్వరూపం... ఉసిరి

by Ravi |   ( Updated:2022-11-15 12:29:08.0  )
భగవత్ స్వరూపం... ఉసిరి
X

కరతలామలకము' అనే సామెత తెలియని వారుండరు. అనగా అరచేతిలోని ఉసిరికాయ. ప్రాచీన ఆర్యజ్యోతిర్విద్వాంసులు ఉసిరి కాయను భూగోళమునకు ఉపమానముగ చూపించారు. అంటే అరచేతి అమలకము వలె గోళ సర్వస్వమును తెలుసుకున్న వారైనట్లు చెప్పారు. విషయ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంటే కరతలామాకమనే సామెతను ఉపయోగిస్తారు. సర్వ ప్రపంచ సదృశమై, భగవత్ స్వరూపమై ఉన్నందునే ఆమలకము దానమునకు ముఖ్యముగా వ్యవహరించ బడుతున్నది.

హిందూ దేశంలో యేటా జరుపుకునే పండుగలలో ఒక్కో రోజు ఒక్కో వృక్ష పూజ ఆచరణలో ఉంది. బిల్వపత్రం, శమీ వృక్షం, ఆమ్ర పుష్పం, అలాగే అమలక ఫల వినియోగం సంప్రదాయ సిద్ధంగా వస్తున్నది. కార్తీకం నుండి చైత్రం వరకు ఆరు మాసాలలో 'పచ్చి అమలక'ని ఏదో విధంగా వాడాలని పెద్దల నిర్దేశం. ఏడాదిలో వచ్చే ఏకాదశులు విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాలను బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మేకాదశి, ఇంద్రికాదశి ఏర్పడగా, ఒక పండు 'ఉసిరిక'తో సంబంధించి ఏర్పడింది ఒక్క అమలకి ఏకాదశి మాత్రమే.

దీనిపై పెద్దల ఉవాచ

స్మృతి కౌస్తుభం, కృత్యసార సముచ్ఛయం, తిథి తత్వం మున్నగు గ్రంథాలు కార్తీక మాసంలో అమలకి వృక్ష మూలాన ఉసిరికాయలతో, ఉసిరిక పత్రితో దైవారాధన చేయాలని, తులసితో పాటు కాయతో ఉసిరిక కొమ్మను పూజించాలని, ఉసిరిక చెట్టు నీడన అన్నం వండాలని, ఉసిరిక పండ్లు కలిపిన నీటితో స్నానం చేయాలని, పూర్ణిమ నాడు ఉసిరిక ఫల దానం చేయాలని, శిరస్సు, ముఖం, హస్తం, దేహమందు ఉసిరిక పండు ధరించాలని వివరిస్తున్నాయి. ఉసిరిక చెట్టు నీడ సోకే కొలనులో స్నానం చేయాలని, ఉసిరిక మాని కింద అరుగు మీద ఆవాసం, పూజ, భోజనం చేయాలని పెద్దల ఉవాచ. అలాగే ఫాల్గుణ మాసంలో మళ్లీ ఉసిరిక వినియోగం ఉంది. 'అమలకే వృక్షే జనార్ధనః'అని అమదేర్ జ్యోతిషి మున్నగు గ్రంథాలు పేర్కొంటున్నాయి.

అమలక వృక్షం జనార్ధన స్వరూపమని, దాని కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు అమలకీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి తెలుపుతున్నది. సంస్కృతంలో అమలకం అంటే గుణమును ధరించునది, రాత్రి దాది వంటిది. వయస్థ వయస్సున నిలుపునది, ఫలరవ సారవంతమైనది. అమృత అమృతం వంటిది. శీతఫలి- శీతవీర్యము కలది. ప్రాణమును నిలుపునది అంటారు. కనుక ఉసిరి అనునది సార్ధక నామమని కొందరి భావన. ఒక పేద ఇల్లాలు ఉసిరి కాయలు భిక్ష పెట్టగా, ఆది శంకరులు కనకధారాస్తవం చెప్పి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారని చెపుతారు.

Also read: ప్రాచీన తెలంగాణ నకాశీ చిత్రకళ గురించి తెలుసా?

ఔషధ గుణాలెన్నో

ఇక వైద్యోపయోగానికి వస్తే షడ్రసాలలో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు దీనిలో ఉన్నాయి. ఇది మహత్తర ఔషధీ గుణం కలది. అమృత ఫలమనే గ్రంథంలో దాని ఔషధ గుణాలు, ఫల జాతులు గ్రంథంలో సర్వాంగాల వైద్య, పారిశ్రామిక ఉపయోగాలు, వాగృబంలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్స ఉపయోగాలు విపులీకృత మై ఉన్నాయి. 'కరతలామలకము' అనే సామెత తెలియని వారుండరు. అనగా అరచేతిలోని ఉసిరికాయ.

ప్రాచీన ఆర్యజ్యోతిర్విద్వాంసులు ఉసిరి కాయను భూగోళమునకు ఉపమానముగ చూపించారు. అంటే అరచేతి అమలకము వలె గోళ సర్వస్వమును తెలుసుకున్న వారైనట్లు చెప్పారు. విషయ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంటే కరతలామాకమనే సామెతను ఉపయోగిస్తారు. సర్వ ప్రపంచ సదృశమై, భగవత్ స్వరూపమై ఉన్నందునే ఆమలకము దానమునకు ముఖ్యముగా వ్యవహరించ బడుతున్నది.

(నేడు కార్తీక పౌర్ణమి)


రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

Advertisement

Next Story