పెండింగ్ కేసుల కోసం ప్రత్యేక కోర్టులు

by  |
పెండింగ్ కేసుల కోసం ప్రత్యేక కోర్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ కేసుల పరిష్కారాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ జిల్లాల్లో ఇరవై కొత్త కోర్టుల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయడంతో పాటు కొత్త కోర్టుల్ని ఏర్పాటు చేయనున్నట్లు కరీంనగర్ వేదికగా 2019 నవంబరులో తెలిపారు. సత్వరం ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఇరవై కొత్త కోర్టుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో అవసరమైన జడ్జి మొదలు అటెండర్ వరకు పోస్టుల్ని సృష్టిస్తున్నట్లు వేర్వేరు జీవోల్లో ఆర్థిక శాఖ పేర్కొంది. సగటున ఒక్కో కోర్టుకు పాతికకు పైగానే పోస్టుల్ని సృష్టిస్తున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ధర్మపురి, గోదావరిఖని, పెద్దపల్లి, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కొడంగల్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, మహబూబ్‌నగర్, వనపర్తి, హైదరాబాద్ తదితర జిల్లాల్లో ఈ కోర్టుల్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్య కార్యదర్శి తెలిపారు. వీటిలో మొత్తం 478 పోస్టుల్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో రెండు ‘పోస్కో’ కోర్టులు కూడా ఉన్నాయి.

Next Story