ICC చైర్మన్‌గా గంగూలీ ఛాన్స్ లేనట్లే..!

by Shyam |
ICC చైర్మన్‌గా గంగూలీ ఛాన్స్ లేనట్లే..!
X

దిశ, స్పోర్ట్స్ :

గత మూడు నెలలుగా ఖాళీగా ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్ పదవి ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. శశాంక్ మనోహర్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ పదవిలో ఈసీబీ మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. గంగూలీ ఎన్నికల బరిలో నిలబడితే తాము మద్దతు ఇస్తామని పలు క్రికెట్ బోర్డులు కూడా బహిరంగంగానే ప్రకటించాయి. అయితే, ఐసీసీ విడుదల చేసిన నామినేషన్ ప్రక్రియలోని నిబంధనల ప్రకారం గంగూలీకి చైర్మన్‌గా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో చాలా అనుభవం ఉన్న గంగూలీ ఏనాడూ ఐసీసీ డైరక్టర్ పదవిలో లేడు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఐసీసీ చైర్మన్‌గా బరిలో నిలవాలంటే ప్రస్తుతం కానీ ఇంతకు ముందు కానీ బోర్డు డైరెక్టర్ పదవిలో తప్పక పని చేసిన వ్యక్తి అయి ఉండాలి. దీంతో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడికి అర్హత లేకుండా పోయింది. ఒక వేళ BCCI తప్పక తమ అభ్యర్థే ICC చైర్మన్ పదవిలో ఉండాలని భావిస్తే మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్‌ను నామినేట్ చేయాల్సి ఉంటుంది. కాగా, ఐసీసీ అర్హతలను బట్టి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ ఎహసాన్ మణికి అవకాశం ఉంది. కానీ ఆయన ఇదివరకే తాను చైర్మన్ ఎన్నికల బరిలో ఉండనని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed